
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు ఆహ్లాదం కలిగించే వార్త ఇది. ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో కిటికీలో నుంచి బయటకు చూడాలనే ప్రయాణికుల ఆశ నెరవేరనున్నది. భారత వైమానిక దళంలోని జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్‌లలో (జేయూఏఎస్))విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కిటికీ షేడ్స్‌ను మూసివేసి ఉంచాలనే నిబంధనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ఉపసంహరించుకుంది. అయితే, విమానాశ్రయాలలో గ్రౌండ్ లేదా ఏరియల్ ఫోటోగ్రఫీపై నిషేధం కొనసాగుతుంది.
పలు భద్రతా కారణాల దృష్ట్యా గతంలో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కిటికీ షేడ్స్‌ను కిందికి ఉంచాలంటూ డీజీసీఏ అన్ని వాణిజ్య, చార్టర్, ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్లకు సూచించింది. ఈ సూచన ముఖ్యంగా ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఎయిర్‌బేస్‌లను ఉద్దేశించి చేశారు. ఇప్పుడు ఈ నియమాన్ని సడలించారు. అయితే ఫోటోలు, వీడియోలు తీయడంపై గల నిషేధం భద్రతా కారణాల దృష్ట్యా అలాగే కొనసాగనుంది. ప్రయాణికులు తమ ప్రయాణంలో ఫోటోలు లేదా వీడియోలు తీయకూడదని డీజీసీఏ కోరింది.
భారత వైమానిక దళం సూచనల ప్రకారం, భద్రత దృష్ట్యా ఫోటోగ్రఫీపై నిషేధం చాలా ముఖ్యమైనదని డీజీసీఏ స్పష్టం చేసింది. టేకాఫ్, ల్యాండింగ్ లేదా విమానం రన్‌వేపై ఉన్నప్పుడు ప్రయాణికులను ఫోటోలు లేదా వీడియోలు తీయడానికి అనుమతించరు. ఈ నియమం ముఖ్యంగా జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్‌లు అని పిలిచే ఐఏఎఫ్ ఎయిర్‌బేస్‌లకు వర్తిస్తుంది. పౌర, సైనిక విమాన కార్యకలాపాలు ఈ విమానాశ్రయాలలో కొనసాగుతాయి. పఠాన్‌కోట్, శ్రీనగర్, ఆగ్రా, బరేలీ, గ్వాలియర్ తదితర ఎయిర్‌బేస్‌లలో ఫోటోగ్రఫీపై నిషేధం వర్తిస్తుంది.