పహల్గాం ఉగ్రదాడిపై విస్తుపోయే వాస్తవాలు.. NIA చేతికి చిక్కిన కీలక ఆధారాలు | NIA Preliminary Report On Pahalgam Incident | Sakshi
Sakshi News home page

పహల్గాం ఉగ్రదాడిపై విస్తుపోయే వాస్తవాలు.. NIA చేతికి చిక్కిన కీలక ఆధారాలు

May 2 2025 12:00 PM | Updated on May 2 2025 12:51 PM

NIA Preliminary Report On Pahalgam Incident

ఢిల్లీ : జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఆర్మీ, లష్కరే తోయిబా కన్నుసన్నల్లో జరిగినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నిర్ధారించింది. పహల్గాం ఉగ్రదాడిలో ఎన్‌ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఎన్‌ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్‌ ఐఎస్‌ఐ,ఉగ్రసంస్థ లష్కరే తోయిబాలు కలిసి ఈ కిరాతక దాడికి పాల్పడినట్లు ఎన్‌ఐఏ తేల్చింది. పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా ఆఫీస్‌లో పహల్గాం ఉగ్రదాడికి కుట్ర జరిగినట్లు ప్రాథమిక నివేదికల్లో పేర్కొంది.

ఇక పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదుల్ని ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. షమీమ్‌ మూసా అలియాస్‌ అస్మీన్‌ మూసా,అలీబాయ్‌ అలియాస్‌ తల్హా నేరుగా ఉగ్రదాడికి పాల్పడినట్లు ఎన్‌ఐఏ తెలిపింది.  

ఎన్‌ఐఏ దర్యాప్తు.. శాటిలైట్‌ ఫోన్ల వినియోగం
పాకిస్తాన్‌ పౌరులైన ఆ ఇద్దరు ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి కొన్ని వారాల ముందు భారత్‌ భూభాగంలోకి ప్రవేశించినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది.   వారికి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWs) సహాయం చేసినట్లు నిర్ధారించింది. అదే సమయంలో పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రాంతంలో ఎన్‌ఐఏ ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ డేటా సేకరించింది. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న 40కి పైగా తుపాకుల బాలిస్టిక్‌, కెమికల్‌ టెస్టులు జరిపేందుకు ల్యాబ్‌కు పంపింది.

 3డీ మ్యాపింగ్‌ సాయంతో 
ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ తీరును గుర్తించేందుకు లేజర్‌ స్కానర్ల సాయంతో త్రీడీ మ్యాపింగ్ చేసింది. ఈ 3డీ మ్యాపింగ్‌ సాయంతో కాల్పుల జరిగే సమయంలో ఉగ్రవాదులు పొజీషన్‌తో పాటు టూరిస్టులు ఎలా కుప్పకూలారు. బ్లడ్‌ శాంపిల్స్‌, కాల్పులు జరిగినప్పుడు బుల్లెట్ల నుంచి వెలువడ్డ రసాయనాలు వంటి వాటిని సేకరించారు. లోయ చుట్టూ ఉన్న మొబైల్ టవర్ల నుండి డంప్ డేటాను కలెక్ట్‌ చేశారు. ఈ డేటా ఆధారంగా ఉగ్రదాడి ముందు రోజుల్లో కాల్పులకు తెగ బడ్డ ప్రదేశం నుంచి శాటిలైట్‌ ఫోన్‌లను వినియోగించారని, ముఖ్యంగా బైసరీన్‌, దాని చుట్టు పక్కల ప్రదేశాల్లో కనీసం మూడు శాటిలైట్‌ ఫోన్లను నిందితులు వినియోగించగా.. రెండు శాటిలైట్ ఫోన్ల సిగ్నల్స్‌ను గుర్తించారు.  

2,800 మందిని విచారించి  
ఉగ్రదాడిపై మొత్తం 2,800 మందికి పైగా ఎన్‌ఐఏ, భద్రతా సంస్థలు ప్రశ్నించాయి. మే2 నాటికి మరో 150 మందిని విచారించేందుకు కస్టడీలోకి తీసుకున్నాయి. వీరిలో అనుమానిత ఓజీడబ్ల్యూ, జమాత్-ఇ-ఇస్లామి వంటి నిషేధిత గ్రూపులు, హురియత్ కాన్ఫరెన్స్‌లోని వివిధ వర్గాలతో సంబంధాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు.

ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటే
 ఉగ్రవాద సంస్థలు, తిరుగుబాటు గ్రూపులకు సాయుధ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకుండా లాజిస్టికల్, ఆర్థిక  సమాచార సహాయాన్ని అందించే వ్యక్తులను ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWలు) అంటారు.

కార్ట్రిడ్జ్‌ అంటే
కాల్పులు జరిపిన తరువాత మిగిలి ఉన్న మందుగుండు సామాగ్రి భాగాన్ని కార్ట్రిడ్జ్ అంటారు. వాటిల్లో బుల్లెట్‌లు,మందుగుండు సామగ్రిలో చేర్చే షెల్, గన్‌ పౌడర్‌, గన్‌లో ఉండే బులెట్లను మండించే ప్రైమర్ల అనే భాగాలున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement