
సుమోటోగా కేసు స్వీకరణ
రెండు వారాల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశం
సీఎస్, డీజీపీలకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికులు చనిపోయేంతగా పెద్ద ఘటన జరగడానికి కారణాలను ప్రశ్నించింది. రెండు వారాల్లో వివరణాత్మకమైన నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.
ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ‘కోనసీమ జిల్లాలోని కొమరిపాలెం గ్రామంలో బాణసంచా తయారీ యూనిట్‌లో ఈ నెల 8న జరిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని మీడియాలో కథనాలు వచ్చాయి. వాటి ఆధారంగా కేసును సుమోటోగా స్వీకరిస్తున్నాం. ఈ ఘటనలో తయారీ యూనిట్ యజమాని కూడా మరణించినట్లు మా దృష్టికి వచ్చింది. మీడియా నివేదికలోని విషయాలు నిజమైతే, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే.
అందువల్ల ఈవిషయంపై రెండు వారాల్లో వివరణాత్మకమైన నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేశాం. బాధితుల సమీప బంధువులకు పరిహారం అందించారా లేదా కూడా నివేదికలో తెలుపుతారని ఆశిస్తున్నాం. పేలుడు జరిగిన సమయంలో 12 మంది కార్మికులు యూనిట్ లోపల ఉన్నారు. పేలుడు పదార్థాల మిశ్రమంలో పొరపాటు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు’ అని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలిపింది.