New Year 2023: Nine Crucial State Elections In 2023 - Sakshi
Sakshi News home page

ఎన్నికల ఏడాది 2023.. త్రిపుర నుంచి తెలంగాణ దాకా...

Published Sun, Jan 1 2023 5:01 AM

New year 2023: Nine crucial state elections in 2023 - Sakshi

కోటి ఆశలతో కొత్త ఆకాంక్షలతో సరికొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాం.   ఈ ఏడాది ఎలా ఉంటుంది ? గతేడాదితో పోలిస్తే ఏం మార్పులొస్తాయి? సామాన్యుల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు
ప్రతి ఒక్కరి మదిలో ఇవే ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి.   వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని కొల్లగొట్టాలంటే   మోదీ చరిష్మా, రాహుల్‌ గాంధీ పాదయాత్ర, కేజ్రివాల్‌ క్రేజ్‌ కీలకంగా మారాయి...


ఇది ఎన్నికల ఏడాది. ఈ ఏడాది మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరగనున్న  లోక్‌సభ ఎన్నికలు ఫైనల్‌ అనుకుంటే ఇవి సెమీఫైనల్స్‌గా భావించవచ్చు. 2022లో ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే బీజేపీ అత్యంత కీలకమైన యూపీ, గుజరాత్‌తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో తిరుగులేని విజయం సాధించి ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్‌ హిమాచల్‌ ప్రదేశ్‌తో సరిపెట్టుకుంటే, అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్‌లో ఘన విజయం సాధించడంతో పాటు గోవా (2 స్థానాలు), గుజరాత్‌ (5 సీట్లు)లో ఖాతా ప్రారంభించి జాతీయ స్థాయిలో ఒక కొత్త శక్తిగా ఎదిగింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తుంది ?

వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి రాజకీయాలు ఎలా మారుతాయన్న చర్చ వేడెక్కిస్తోంది. త్రిపుర నుంచి తెలంగాణ వరకు మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు 116 లోక్‌సభ స్థానాల పరిధిలో జరుగుతూ ఉండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సారి త్రిపుర, మేఘాలయాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పోటీకి దిగుతూ ఉండడంతో మమతా బెనర్జీ కూడా జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి సిద్ధమవుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు,  పెరిగిపోతున్న ధరలు,  సైద్ధాంతికపరమైన విభేదాలు, మత పరమైన విభజనలు,, సామాజిక అస్థిరతలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎన్నికల్ని ఎలాంటి మలుపు తిప్పుతాయో చెప్పలేని పరిస్థితులున్నాయి.  

బీజేపీ వ్యూహాలు ఇలా..!
కేంద్రంలో అధికార బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకున్న వ్యక్తిగత చరిష్మానే నమ్ముకుంది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక అంశాలే కీలకంగా మారినప్పటికీ కమలనాథులు మరోసారి మోదీ మ్యాజిక్‌నే పరీక్షకు నిలబెడుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే కేంద్రం ప్రతీ నిర్ణయం తీసుకోనుంది. అన్నింటికి మించి  ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్రబడ్జెట్‌ ఈ ఎలక్షన్‌ ఏడాదిలో సలక్షణంగా ఉండే అవకాశాలే ఉన్నాయి. విదేశీ వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తున్న మోదీ సర్కార్‌ వచ్చే సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగే జీ–20 సదస్సు ద్వారా భారత్‌ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టామన్న నినాదంతో వచ్చే ఎన్నికల్ని ఎదుర్కోవచ్చంటున్నారు. సదస్సుకు ముందే జమ్ము కశ్మీర్‌లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని మోదీ, అమిత్‌ షా ద్వయం భావిస్తోంది. డిసెంబర్‌ నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తే మతపరంగా ఓట్లను ఏకీకృతం చేసే వ్యూహం ఫలించి ఢిల్లీ పీఠం మరోసారి తమకే దక్కుతుందన్న ఆత్మవిశ్వాసం అధికార పార్టీలో కనిపిస్తోంది.  

కాంగ్రెస్‌కి పూర్వ వైభవం వస్తుందా ?  
కాంగ్రెస్‌ పార్టీకి కొత్త జవసత్వాలు కల్పించే రెండు ఘటనలు 2022లో జరిగాయి. గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి మల్లిఖార్జున్‌ ఖర్గేకి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించడం ద్వారా ఒక కొత్త చరిత్ర నెలకొల్పితే, కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర మరో చరిత్రగా మారుతోంది. రాహుల్‌ పాదయాత్రకి వస్తున్న ప్రజాదరణని చూస్తుంటే తనపైనున్న పప్పు ముద్రను తొలగించుకొని రాహుల్‌ సరికొత్త రాజకీయ నాయకుడిగా ఎదిగే రోజు ఎంతో దూరం లేదనే అనిపిస్తోంది.

పార్లమెంటు వేదికగా బీజేపీని ఇరుకున పెట్టేలా మాటల తూటాలు విసురుతూ, వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అంతర్గత పోరుల్ని చక్కదిద్దుతూ మల్లికార్జున ఖర్గే తన కొత్త బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తూ ఉండడం కాంగ్రెస్‌కి కలిసొచ్చే అంశం. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ వాటిని నిలబెట్టుకుంటూనే, తమకు అనుకూలంగా ఉన్న  కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో విజయం సాధిస్తే లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రధాని మోదీని ఎదుర్కొనే నాయకుడిగా రాహుల్‌ అవతరిస్తారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.  

ప్రతిపక్షాల ఐక్యత సాధ్యమా?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీకి 2022 తీపి జ్ఞాపకాలనే అందించి వెళ్లింది. జాతీయ పార్టీగా కొత్త హోదా రావడంతో ప్రధాని మోదీ చరిష్మాకు దీటుగా నిలబడే వ్యక్తిగా కేజ్రీవాల్‌ నిలబడతారని ఆ పార్టీలో కొత్త ఆశలు చిగురించాయి. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు తేజస్వి యాదవ్‌ ఆధ్వర్యంలో జరుగుతాయని ప్రకటించడం ద్వారా తాను పూర్తిగా రేసు నుంచి తప్పుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరిన్ని రాష్ట్రాలకు తమ పార్టీలని విస్తరించి జాతీయ స్థాయిలో పట్టు బిగించాలని చూస్తున్నారు.  ప్రాంతీయ పార్టీల నాయకులందరూ ఢిల్లీ పీఠంపైనే గురి పెట్టడంతో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి వీరంతా కలసికట్టుగా ఉండే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో కాంగ్రెస్‌ని కలుపుకుంటూ పోతూ విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తేనే ప్రధాని మోదీని ఎదుర్కొని నిలబడగలరు. ప్రతిపక్షాలు చేతులు కలిపి బీజేపీకి సవాల్‌ విసురుతారో లేదో ఈ ఏడాదిలోనే తేలిపోనుంది.

2023 కేలండర్‌
► ఫిబ్రవరి–మార్చి: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికలు
► మే: కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు
► జూలై– ఆగస్టు: 10 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్‌ నుంచి అత్యధిక సీట్లు
► నవంబర్‌–డిసెంబర్‌: హిందీ బెల్ట్‌ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంతో పాటుగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement