
పూణేలో ఇటీవల జరిగిన ‘అత్యాచార ఘటన’ కొత్త మలుపు తిరిగింది. ఓ డెలివరీ బాయ్ తనపై పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారానికి ఒడిగట్టాడని, మళ్లీ వస్తా అని మెసేజ్ కూడా ఫోన్‌లో టైప్ చేశాడని అని యువతి చెప్పిందంతా అంతా తూచ్ అని పోలీసులు తేల్చేశారు. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి డెలివరీ బాయ్ వచ్చి అత్యాచారానికి పాల్పడలేదని, ఇది తన ఫ్రెండ్‌తో కలిసి ఆ 22 ఏళ్ల యువతి ఆడిన కట్టుకథ అని పోలీసులు స్పష్టం చేశారు.
పూణేలో 22 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ పై జరిగిన అత్యాచారం కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడి వ్యక్తి అపరిచితుడు కాదని, ఆ మహిళకు తెలిసిన వ్యక్తే అని పోలీసులు వెల్లడించారు. అత్యాచారం అనంతరం నిందితుడు తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడని యువతి పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే. దాన్ని సాక్ష్యంగా చూపించేందుకు ఆమె సెల్ఫీ స్వయంగా తీసుకుందని తేలింది. నిందితుడు తన ఫోన్లో మళ్లీ వస్తా అని మెసేజ్ టైప్ చేసి ఉంచడం కూడా కల్పితమని పోలీసులు బట్టబయలు చేశారు.
పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ శుక్రవారం( జూలై 4వ తేదీ) మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి ఆమెకు రెండేళ్లుగా పరిచయం ఉంది. ఆమెకు అతను కొత్త వ్యక్తి కాదు. ఆ సెల్ఫీని సైతం ఆమె స్వయంగా తీసుకుంది. ఐ విల్ బీ బ్యాక్( నేను మళ్లీ వస్తా) అనే మెసేజ్‌ను కూడా ఆమె టైప్ చేసింది’ అని చెప్పారు.
మరి ఆరోపణలు ఎందుకు చేసింది..?
డెలివరీ బాయ్ పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని ఆమెకు ఎందుకు చెప్పిందనే దానిపైనే ఇప్పుడు పూర్తి దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇంకా విచారణ దశలోనే ఉందని, అయితే యువతి మానసిక స్థితి సరిగా లేనట్లు ఉందన్నారు. ఇంకా దర్యాప్తు జరుగుతుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
ఇంతకీ యువతి ఫిర్యాదు ఏమిటంటే..!
పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి సదరు యువతి నివాసం ఉంటోంది. ఆమెకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడని. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడని పేర్కొంది. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లినట్లు, ఆ తర్వాత డెలివరీ బాయ్ తనపై పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని తెలిపింది. ఇదే విషయాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.