మిడిల్‌ క్లాస్‌కు మెలోడీ! | New GST From 22 September little saving for the middle class People | Sakshi
Sakshi News home page

మిడిల్‌ క్లాస్‌కు మెలోడీ!

Sep 22 2025 1:37 AM | Updated on Sep 22 2025 1:38 AM

New GST From 22 September little saving for the middle class People

నేటి నుంచే జీఎస్‌టీ 2.0

మధ్యతరగతి ప్రజలకు కాస్త ఆదా

5%.. 18%..40%... ఇకపై ఈ మూడే శ్లాబ్‌లు 

కిరాణా సరుకులు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ 5 శాతంలోకి 

ఔషధాలు, వైద్య సంబంధ పరికరాలపైనా పన్ను తగ్గింపు.. బీమా పాలసీ ప్రీమియంలపై పూర్తిగా పన్ను మినహాయింపు 

కుటుంబాన్ని బట్టి నెలకు రూ.1700–2200 మిగిలే చాన్స్‌ 

40 శాతంలోకి సిగరెట్లు, పాన్‌మసాలా, గుట్కా

సిమెంటు సహా నిర్మాణ సామగ్రిపై తగ్గింపు 

రోడ్లపైకి మరిన్ని చిన్నకార్లు

1500 సీసీ దాటిన ఎస్‌యూవీలు,హైఎండ్‌ కార్లపై 40% పన్ను 

అంతిమ ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రభుత్వం పర్యవేక్షణ  

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వివిధ వస్తువులపై సవరించిన కొత్త పన్ను రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ... జీఎస్‌టీ 2.0గా పేర్కొంటున్న ఈ సవరణలతో చాలా వస్తువుల ధరలు మారబోతున్నాయి. మధ్యతరగతి భారతావనికి ఈ పన్నుల మార్పు ఎంతో మేలు చేస్తుందని, చాలా వస్తువుల ధరలు తగ్గుతాయని  ప్రభుత్వం చెబుతోంది. ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ సైతం ఇదే చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు జీఎస్‌టీ మండలి చేసిన సవరణల వల్ల ఎవరికి లాభం? ధరల్లో హెచ్చుతగ్గులు ఏ రకమైన ప్రభావం చూపబోతున్నాయి? దీనిపై ‘సాక్షి’ సమగ్ర కథనమిది.. 

ఇక 12 శాతం; 28 శాతం ఉండవు... 
సేల్స్‌ట్యాక్స్, వ్యాట్, సెంట్రల్‌ ఎక్సైజ్, సర్వీస్‌ ట్యాక్స్‌ సహా పలు రకాల పరోక్ష పన్నులన్నిటినీ తొలగిస్తూ 2017 జూలై నుంచీ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ (జీఎస్‌టీ) అమల్లోకి వచ్చింది. తక్కువ పన్నురేట్లుండాలని మొదట లకి‡్ష్యంచినా సాధ్యం కాలేదు. తాజా సవరణలతో అది సాధ్యమై జీఎస్‌టీ శ్లాబ్‌లు 3కు తగ్గాయి. తక్కువ శ్లాబ్‌లుంటే పాలన, ధరల నిర్ణయం, బిల్లింగ్‌ సులువవుతుంది. పన్ను అధికారులపైనా భారం తగ్గుతుంది. జీఎస్‌టీ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత ప్రధానమైనది.. 12 శాతం, 28 శాతం పన్ను రేట్లను పూర్తిగా తొలగించటం. 

కొన్ని విలాస, అనారోగ్య (సిన్‌) వస్తువుల కోసం 40 శాతం పన్ను రేటును చేర్చటం. వాస్తవంగా చూస్తే చాలావరకూ ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ 5% పరిధిలోకి వచ్చాయి. కొన్నింటిపై పన్నే లేకుండా చేశారు. గతంలో వీటిపై 12, 28 శాతం పన్ను రేట్లుండేవి. ఇది అత్యధికులకు ఊరటే. ఇక కొన్ని విలాస వస్తువులు, కూల్‌డ్రింక్స్, టొబాకో ఉత్పత్తులు, పాన్‌ మసాలా వంటివి మాత్రం 28 శాతం పన్ను పరిధిలో ఉండగా ఇపుడు 40 శాతం శ్లాబ్‌లోకి వెళ్లాయి.  


తగ్గింపు ప్రయోజనాలు ఎక్కువే... 
ముఖ్యంగా ప్రాణాధార ఔషధాలపై పన్ను భారం తొలగిపోనుంది. మరెన్నో ఔషధాలు, వైద్య పరికరాలు, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులైన టూత్‌బ్రష్‌, టూత్‌పేస్ట్, సబ్బులు, షాంపూలు, హెయిర్‌ ఆయిల్, టాల్కమ్‌ పౌడర్, షేవింగ్‌ క్రీమ్‌తో పాటు నెయ్యి, పన్నీరు, బటర్, నమ్కీన్, కెచప్, డ్రై ఫ్రూట్స్, కాఫీ దగ్గర్నుంచి.. పెద్ద సైజు టీవీలు, ఏసీలు, వాషింగ్‌ మెషీన్లు, కార్ల వరకు మొత్తం 375 ఉత్పత్తుల ధరలు గతంతో పోల్చితే తగ్గనున్నాయి. 

ఈ తగ్గింపు వల్ల జనం చేతుల్లో మరికొంత డబ్బు మిగులుతుంది కనక ఇది సేవింగ్స్‌లోకి, స్టాక్‌ మార్కెట్లోకి మళ్లే అవకాశం ఉందనేది ప్రభుత్వం అంచనా. అంతిమంగా ఇది ఆర్థిక వృద్ధికి దారితీయాలనేది లక్ష్యం. అయితే అదే తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు తగ్గిపోకూడదు కనక విలాస, అనారోగ్య వస్తువులపై ఏకంగా పన్ను శాతం 40కి పెంచారు.  

ధర పెరిగే వస్తువులివీ.. 
⇒ బీడీ మినహా సిగరెట్లు, సిగార్లు, గుట్కా, పాన్‌ మసాలా, నికొటిన్‌ ఉత్పత్తులు గతంలో ఉన్న 28 శాతం నుంచి 40 శాతానికి చేరాయి. అయితే ఈ పెంపు ప్రస్తుతానికి అమల్లోకి రాదు. బీడీలపై పన్నును మాత్రం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. బిహార్, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో సిగరెట్లు తాగేవారికన్నా బీడీలు కాల్చేవారు దాదాపు మూడురెట్లు ఎక్కువనేది గమనార్హం. 
⇒ కార్బొనేటెడ్‌ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కెఫైన్‌ ఆధారిత పానీయాలను 28 నుంచి 40 శాతంలోకి చేర్చారు.  
⇒ లాటరీ టికెట్లు, కేసినో సేవలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫారాలపై పన్ను రేటు 40 శాతంగా నిర్ణయించారు. 
⇒ 1,500 సీసీకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న ఎస్‌యూవీలు, హై–ఎండ్‌ కార్లపై ఇకపై 40 శాతం జీఎస్‌టీ 
అమలవుతుంది. 
⇒ ఫ్యాట్స్, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే ఫాస్ట్‌ ఫుడ్స్, ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌ కూడా ఇకపై 40 శాతం శ్లాబ్‌లోకి వస్తాయి.  

మధ్యతరగతిపై ప్రభావమెంత? 
మధ్య తరగతి ప్రజలకు ఈ సవరణల్లో ఎక్కువ లాభం తెచ్చేవి ఏవైనా ఉన్నాయంటే అవి కిరాణా సరుకులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులే. చాలా వస్తువులు 18, 12 శాతాల నుంచి 5 శాతం పరిధిలోకి రావటమే ఇందుకు కారణం. ఇక ఔషధాలు, బీమా రూపేణా కలిసొచ్చేది ఎక్కువే. అందుకే ప్రతినెలా కొంత కచ్చితంగా ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. పట్టణ మధ్య తరగతి కుటుంబాల్లో ఈ నెలవారీ ఆదా మందులను కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ.1700 నుంచి రూ.2200 వరకూ ఉండవచ్చనేది నిపుణుల అంచనా. 

పైపెచ్చు ఈ జీఎస్‌టీ సవరణల్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఏ వస్తువుపై ఎంత తగ్గిందనేది ప్రతి తయారీదారూ కచ్చితంగా ప్రకటించాలనే నియమాన్ని పెట్టింది. ఈ మేరకు తయారీదారులు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం కల్పిస్తోంది. పైపెచ్చు ఉత్పత్తిదారులు తగ్గించినా రిటైల్‌ అమ్మకందారులు తగ్గించకపోతే పన్ను తగ్గింపు ప్రయోజనం జనానికి చేరదు కనక ఈ అమలు తీరును 6 నెలల పాటు నిశితంగా పర్యవేక్షించనుంది కూడా.

ఏవి చౌకగా లభిస్తాయంటే..
⇒ వెన్న, నెయ్యి, చీజ్, కండెన్స్‌డ్‌ మిల్‌్క, యూహెచ్‌టీ మిల్క్‌ వంటివి గతంలో 12, 5 శాతాల్లో ఉండగా ఇపుడు 5, సున్నా శాతాల్లోకి వచ్చాయి.  
⇒ బిస్కెట్లు, కేక్‌లు, పాస్తా, ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్‌ వంటి బ్రేక్‌ఫాస్ట్‌ సిరెల్స్, చీజ్‌ పఫ్‌లు, పలు రకాల కన్ఫెక్షనరీ ఉత్పత్తులు గతంలో ఉన్న 18 నుంచి 5 శాతానికి దిగివస్తాయి. 
⇒ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులైన షాంపూలు, తల నూనె, టూత్‌పేస్ట్, సబ్బులు చాలావరకూ గతంలో 18 శాతంలో ఉండగా ఇపుడు 5 శాతం పరిధిలోకి వచ్చాయి. 
⇒ ఆహార దినుసులతో పాటు శీతల పానీయాల పరిధిలోకి రాని జ్యూస్‌లు, మొక్కల ఆధారిత మిల్క్‌ డ్రింక్‌లు, పలురకాల డ్రైఫ్రూట్స్‌ గతంలో 12, 28 శాతాల్లో ఉండగా ఇపుడు 5 శాతానికి వచ్చాయి.  
⇒ చిన్న, మిడ్‌సైజ్‌ కార్లపై గతంలో ఉన్న 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గించారు. వాహనాల ధర ఎక్కువ కనక ఈ పన్ను తగ్గింపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలూ జీఎస్‌టీ సవరణకు అనుగుణంగా తమ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.  
⇒ 32 అంగుళాలకు మించి ఉన్న టీవీలపై ఇప్పటి వరకు ఉన్న 28 శాతం జీఎస్‌టీ కాస్తా 18 శాతం కిందకు వచ్చింది. దీంతో వాటి మోడళ్ల ఆధారంగా రూ.2,500 నుంచి రూ.85,000 వరకు ధరలు తగ్గాయి. ప్రముఖ కంపెనీలు సోనీ, ఎల్‌జీ, ప్యానాసోనిక్‌ ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించాయి. ఏసీలు, కొన్ని రకాల వాషింగ్‌ మెషీన్లపైనా జీఎస్‌టీ 28% నుంచి 18 శాతానికి తగ్గింది.  
⇒ నిర్మాణంలోకి వినియోగించే సిమెంట్, ఇతర బిల్డింగ్‌ మెటీరియల్స్‌పైనా జీఎస్‌టీ తగ్గించడమనేది ఇళ్ల మార్కెట్‌కు అనుకూలించనుంది.

ముందు వరుసలో కార్ల కంపెనీలు... 
⇒ మారుతి సుజుకీలో ప్రారంభ శ్రేణి కార్లు అయిన ఎస్‌ప్రెస్సోపై రూ.1,29,600, ఆల్టో కే10పై రూ.1,07,600 వరకు ధర తగ్గింది. గ్రాంట్‌ విటారాపై రూ.1.07 లక్షలు, ఎక్స్‌ఎల్‌ 6పై రూ.52,000, ఎర్టిగాపై రూ.46,400 వరకు ధర తగ్గిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇతర అన్ని మోడళ్లపైనా ధరలు తగ్గాయి.  
⇒ టాటా మోటార్స్‌ తన పంచ్‌ ఎస్‌యూవీపై రూ. 85,000, నెక్సాన్‌పై రూ.1.55 లక్షల వరకు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కర్వ్‌పై రూ.65,000, హ్యారియ ర్, సఫారీ ధరలు రూ.1.45 లక్షల వరకు తగ్గాయి.  

⇒ మహీంద్రా అండ్‌ మహీంద్రా తన మోడళ్ల ధరలను గరిష్ఠంగా రూ.1.56 లక్షల వరకు తగ్గించింది. ఇందులో పాపులర్‌ మోడల్‌ బొలెరో ధర రూ.1.27 లక్షలు తగ్గింది. థార్‌ డీజిల్‌ వేరియంట్లపై రూ.1.35 లక్షల వరకు తగ్గింది.  
⇒ కియా కార్ల ధరలు రూ.4.48 లక్షల వరకు చౌక అవుతున్నాయి. మెర్సెడెస్‌ బెంజ్‌ తన విలాస కార్లు ఏ–క్లాస్‌పై రూ.2 లక్షల వరకు, ఎస్‌–క్లాస్‌పై రూ.10 లక్షల వరకు ధరలు తగ్గించింది. బీఎండబ్ల్యూ కార్ల ధరలు రూ.13.6 లక్షల మేర తగ్గాయి. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ వాహన ధరలు రూ.4.5–30.4 లక్షల మధ్య తగ్గాయి. హీరో మోటోకార్ప్‌ బైక్‌లు, స్కూటర్ల ధరలు రూ.15,743 వర కు, హోండా మోటార్‌ సైకిల్‌ వాహన ధరలు 350 సీసీలోపు ఉన్న వాటిపై రూ.18,800 వరకు తగ్గాయి.

వీటిపై ఇక నో జీఎస్‌టీ 
జీవిత బీమా, ఆరోగ్య బీమాపై ఇప్పటి వరకు 18 శాతం జీఎస్‌టీ అమల్లో ఉండగా, పూర్తి మినహాయింపు ఇచ్చారు. దీంతో ఈ మేరకు పాలసీ ప్రీమియం ధరలు తగ్గుతాయి. జీవిత బీమా పాలసీల్లోనూ ఎన్నో రకాలున్నాయి. వీటిపై భిన్నమైన జీఎస్‌టీ అమలవుతోంది. టర్మ్‌ ఇన్సూరెన్స్‌పై 18 శాతం... ఎండోమెంట్‌ ప్లాన్లపై మొదటి ఏడాది 4.5 శాతం.. రెండో ఏడాది నుంచి 2.25 శాతం చొప్పున కాల వ్యవధి ముగిసే వరకు ప్రీమియంపై జీఎస్‌టీ చెల్లించాల్సి వచ్చేది. సింగిల్‌ ప్రీమియం పాలసీలపై 1.8 శాతం, యులిప్‌ ప్లాన్లపై (పెట్టుబడి భాగం కాకుండా, బీమా రక్షణ చార్జీలపైనే) 18 శాతం అమల్లో ఉంది. 

వీటన్నింటిపై జీఎస్‌టీ మినహాయింపు ఇచ్చారు. ఇకపై ఈ మేరకు ప్రీమియం భారం తగ్గుతుంది. కేన్సర్, జన్యు సంబంధిత, అరుదైన వ్యాధులు, గుండె జబ్బులకు వినియోగించే 33 ఔషధాలను జీఎస్‌టీ నుంచి మినహాయించారు. వీటికి తోడు 12 శాతం పరిధిలో ఉన్న పలు ఔషధాలను 5 శాతం శ్లాబుకు మార్చడంతో ఈ మేరకు ఉపశమనం లభించనుంది. గ్లూకో మీటర్లు, డయాగ్నోస్టిక్స్‌ కిట్లు కూడా 5 శాతం కిందకు మారాయి. ఈ మేరకు ఎంఆర్‌పీలను సవరించాలని, లేదంటే పాత ఎంఆర్‌పీ రేట్లపై తగ్గించి విక్రయించాలని (సెపె్టంబర్‌ 22 నుంచి) ఔషధ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement