
బీజేపీ ఆరోపణల అనంతరం ఈసీ నోటీస్
ఆరోపణలపై దర్యాప్తు చేపడతామని వెల్లడి
పట్నా: బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)అనంతరం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో తన పేరు గల్లంతయిందంటూ ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ చేసిన తీవ్ర ఆరోపణలను ఎన్నికల కమిషన్(ఈసీ) తీవ్రంగా పరిగణిస్తోంది. ఓటరు ఐడీ నంబర్ మారిందని తేజస్వీ శనివారం వ్యాఖ్యానించగా ఈసీ వెంటనే ఖండించడం తెల్సిందే. ముసాయిదా ఓటరు జాబితాలో తేజస్వీ పేరు ఉందని స్పష్టం చేసింది.
తేజస్వీ చూపుతున్న ఓటరు ఐడీ కార్డు తాము జారీ చేసిందేనని భావించడం లేదని, దర్యాప్తు చేపట్టి నిజాలు తేలుస్తామని పట్నా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, దిఘా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి త్యాగరాజ పేర్కొన్నారు. ఈ మేరకు తేజస్వీకి ఆయన ఒక నోటీస్ పంపారు. కొత్త ఓటరు కార్డును తమకు అందజేయాలని కోరారు. రెండు వేర్వేరు నంబర్లతో కూడిన రెండు కార్డులను ఆయన కలిగి ఉండటంపై దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.
ఓటరు జాబితాలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 204 పరిధిలో ఓటరు సీరియల్ నంబర్ 416 తేజస్వీదేనని వివరించింది. ఆయన ఓటరు కార్డు నంబర్ ఆర్‌ఏబీ0456228 అని పేర్కొంది. ‘మీరు మీడియా సమావేశంలో ప్రదర్శించిన ఓటరు ఐడీ నంబర్ ఆర్‌ఏబీ2916120. ఆ ఎపిక్ నంబర్ మేం అధికారికంగా జారీ చేసింది కాదని దర్యాప్తులో వెల్లడైంది. మీరు చూపిన ఆ ఎపిక్ కార్డు ఒరిజినల్ కాపీని మాకు అందజేయండి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాల్సి ఉంది’ అని ఈసీ ఆ నోటీసులో తేజస్వీని కోరింది.
తేజస్వీపై కేసు పెట్టాలి: బీజేపీ
రెండు ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్న తేజస్వీ యాదవ్ నేరానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. అధికారికంగా వెల్లడించిన ఓటరు గుర్తింపు కార్డు నంబర్, తేజస్వీ మీడియా ఎదుట ప్రదర్శించిన కార్డు నంబర్ ఒక్కటి కాదని తెలిపింది. ‘ఈ వ్యవహారం ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ల అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసింది. ఎన్నికల కమిషన్‌కు అబద్ధాలు చెప్పి, వాగ్దాన భంగానికి పాల్పడ్డారు’ అని బీజేపీ నేత సంబిత్ పాత్ర ఆరోపించారు.
శనివారం తేజస్వీ మీడియాకు చూపిన ఓటరు ఐడీ నంబర్ 2020లో జారీ చేసిన ఓటరు ఐడీ నంబర్ ఒక్కటి కాదన్నారు. రెండు ఓటరు ఐడీలు కలిగి నేరానికి పాల్పడిన తేజస్వీపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈసీ విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో 65 లక్షల మంది అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించినట్లు ఈసీ ప్రకటించడం, ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలకు దిగడం తెల్సిందే.