
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మహారాష్ట్రలోని నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ నూతన ఎయిర్‌పోర్టును పరిశీలించారు. అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) కింద ఈ భారీ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.
ఈ విమానాశ్రయం ఈ ఏడాది డిసెంబర్‌లో దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలకు అందుబాటులోకి రానుంది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్‌ఎంఐఏ) మొదటి దశను రూ. 19,650 కోట్ల వ్యయంతో నిర్మించారు. భారతదేశంలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్ట్ ఇదే. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్‌ఎంఐఏ)కు అనుసంధానంగా ఇది పనిచేస్తుంది. సీఎస్‌ఎంఐఏలో ఏర్పడే రద్దీని తగ్గిస్తుంది.
ఇప్పుడు బహుళ విమానాశ్రయాలు కలిగిన ప్రపంచ నగరాల్లో ముంబైకి ప్రత్యేక స్థానం దక్కింది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఈ విమానయాన సౌకర్యం పూర్తిగా అందుబాటులోకి వచ్చాక ఏడాదికి తొమ్మిది కోట్ల మంది ప్రయాణికుల సామర్ధ్యాన్ని కలిగివుంటుంది. 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేస్తుంది. విమానాశ్రయ కార్యకలాపాల ప్రారంభ దశలో ఏడాదికి రెండు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందించనుంది.
నవీ ముంబైలోని కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాంతపు సామర్థ్య పరిమితులను అధిగమిస్తుందని, కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను అందిస్తుందని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ)పేర్కొంది. కాగా విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) గత సెప్టెంబర్ 30న విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను మంజూరు చేసింది. టెర్మినల్‌లో 66 చెక్-ఇన్ పాయింట్లు, 22 స్వీయ-సేవ సామాను డ్రాప్ స్టేషన్లు, 29 ప్రయాణీకుల బోర్డింగ్ వంతెనలు, బస్సు బోర్డింగ్ కోసం 10 గేట్లు తదితర సౌకర్యాలు ఉన్నాయి.

ఈ విమానాశ్రయ కార్యకలాపాలు సాంకేతికంగా అధునాతనంగా ఉంటాయి. 5జీ నెట్‌వర్క్‌లు, పర్యవేక్షణ కోసం అధునాతన సెన్సార్‌లు, ఆటోమేటెడ్ లగేజ్ సిస్టమ్‌లు, మెరుగైన సౌలభ్యం కోసం డీజీ యాత్ర ద్వారా కాంటాక్ట్‌లెస్ ప్రాసెసింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ కార్గో సౌకర్యం పూర్తి ఆటోమేషన్‌తో పనిచేస్తుంది. డిజిటల్ కన్సైన్‌మెంట్ ట్రాకింగ్, డిజిటల్ లావాదేవీలు, మందులు , పాడైపోయే వస్తువుల కోసం ప్రత్యేక నియంత్రిత విభాగాలు అందుబాటులో ఉంటాయి.