హిందూ దత్తపుత్రునికి సంప్రదాయ రీతిలో పెళ్లి
రాయచూరు(కర్ణాటక): ముస్లిం తల్లిదండ్రులు, తమ హిందూ దత్తపుత్రుని పెళ్లిని హిందూ సంప్రదాయ రీతిలో ఘనంగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. ఈ అపురూపమైన సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా బస్తవాడిలో జరిగింది. వివరాలు.. మెహబూబ్ హసన్ నాయికోడి, నూర్జహాన్ దంపతులు ఈ ఔదార్యాన్ని చాటుకున్నారు. లింగాయత్ వర్గానికి చెందిన శివానంద కాడయ్య దంపతులు అర్ధాంతరంగా చనిపోయారు.
వారి కుమారులు సోమశేఖర్ (4), వసంత్ (2)లను మెహబూబ్ దంపతులు చిన్నప్పుడే దత్తత తీసుకుని పోషిస్తున్నారు. మెహబూబ్ ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి రిటైరయ్యారు. అప్పటికే వారికి ఇద్దరు చొప్పున మగపిల్లలు, ఆడపిల్లలు ఉన్నా భారంగా భావించకుండా చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేశారు. సోమశేఖర్ డిగ్రీ పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తు పూనం అనే యువతిని ప్రేమించాడు. దీంతో కాడ సిద్ధేశ్వర మండపంలో ముస్లిం తల్లిదండ్రులు హిందూ సంప్రదాయ రీతిలో దత్త కుమారుని పెళ్లి వేడుకలను జరిపించారు. మత సమైక్యతకు ఈ సన్నివేశం అద్దం పట్టగా, మెహబూబ్, నూర్జహాన్లను గ్రామస్తులు అభినందించారు.


