
న్యూఢిల్లీ: రైళ్లలో ఐఆర్‌సీటీసీ అందించే ఆహారంపై అప్పుడప్పుడు పలు విమర్శలు వినిపిస్తుంటాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ భార్య అనితా సింగ్ తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో తమకు వడ్డించిన ఆహారం బాగోలేదంటూ విమర్శించారు. ఈ నేపధ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అనితా సింగ్.. రైలు ఆహారం విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. రోటీ అప్పడంలా ఉందని, పన్నీర్ పాచిపోయిందని, పప్పు.. నీళ్లగా ఉందని పేర్కొన్నారు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ఐఆర్‌సీటీసీ ప్రీమియం రైలుగా చెబుతున్నప్పటికీ, క్యాటరింగ్ ప్రమాణాలు అందుకు అనువుగా లేవని అనితా సింగ్ వ్యాఖ్యానించారు. ఆమె తన పోస్ట్‌కు రైల్వే మంత్రిత్వ శాఖను, మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేశారు.
ఆమె వ్యాఖ్యలకు వెంటనే స్సందించిన ఐఆర్‌సీటీసీ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఆహారం వడ్డించే ముందు సిబ్బంది దానిని తనిఖీ చేస్తారని, ఆ రోజు అదే కోచ్‌లోని ఇతర ప్రయాణీకుల నుండి ఎటువంటి ఫిర్యాదు రాలేదని పేర్కొంది. అయితే అనితా సింగ్ అభిప్రాయాన్ని విలువైనదిగా పరిగణిస్తున్నామని తెలిపింది. కాగా ఆమె సోషల్ మీడియా పోస్టుకు యూజర్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సమస్యను అంగీకరించే బదులు, ఐఆర్‌సీటీసీ తనను తాను సమర్థించుకుంటోందని కొందరు వ్యాఖ్యానించారు. తేజస్, శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్లలో కూడా ఆహారం బాగుండటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.