
పసిబిడ్డను కాలువలోకి విసిరేసింది
మూడోసారి ఆడపిల్ల పుట్టిందని ఓ తల్లి దురాగతం
సాక్షి, బళ్లారి: మొదటి కాన్పు, రెండవ కాన్పులో ఆడపిల్లలే పుట్టారు, మూడవ కాన్పులో మగపిల్లవాడు పుడతాడని భావించిన తల్లి ఆడపిల్ల పుట్టిందని పేగుబంధాన్ని తెంచుకుని, ఆ బిడ్డను తుంగభద్ర కాలువలోకి విసిరేసింది. బళ్లారి జిల్లాలోని సండూరు తాలూకా తోరణగల్లులో ప్రియాంక దేవి అనే కఠినాత్మురాలు ఈ ఘోరానికి ఒడిగట్టింది. ఆమె భర్త సనోజ్‌కుమార్ జిందాల్లో ఉద్యోగి, బిహార్ కి చెందిన ఈ దంపతులు తోరణగల్లులో ఉంటున్నారు.
రెండు నెలల కిందట ఆమెకు ఆడపిల్ల పుట్టింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆనాటి నుంచి కోపంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో శనివారం వేకువన పసిపానను నీటి కాలువలోకి పడేసింది. ఏమీ తెలియనట్లు తోరణగల్లు పోలీస్టేషన్‌లో బిడ్డ కనిపించడంలేదని విలపిస్తూ నటించింది. పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా తల్లి కాలువ వద్దకు తీసుకెళ్తున్న దృశ్యం çకనిపించింది. కసాయి తల్లిని గట్టిగా ప్రశ్నించగా నేరం ఒప్పుకుంది. ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. సోమవారం ఉదయం శిశువు శవం దొరికింది.