
న్యూఢిల్లీ: దేశంలో ఆరోగ్య సంరక్షణ, విద్య విషయంలో పెరుగుతున్న ఖర్చులు సామాన్యులు భరించలేనివిగా మారాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మాధవ్ సృష్టి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం భగవత్ మాట్లాడుతూ ఒకప్పుడు సేవా కార్యక్రమాలకు ప్రతీకగా నిలిచిన విద్య,వైద్య రంగాలు నేడు లాభాలతో నడిచే సంస్థలుగా మారాయని అన్నారు.
క్యాన్సర్ చికిత్స విషయానికొస్తే దేశంలోని ఎనిమిది నుండి పది నగరాల్లో మాత్రమే అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగులు చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తున్నదని, చాలా దూరం ప్రయాణించవలసి వస్తున్నదని అన్నారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ ఆందోళనకు కారణం కాకూడదని భగవత్ పేర్కొన్నారు. తన ప్రసంగంలో మోహన్ భగవత్ తన చిన్ననాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ ‘నేను మలేరియాతో బాధపడుతూ మూడు రోజుల పాటు పాఠశాలకు వెళ్లలేనసప్పుడు.. మా ఉపాధ్యాయుడు నా చికిత్స కోసం అడవి మూలికలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఆయన తన విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఆ రకమైన వ్యక్తిగత సంరక్షణ సమాజానికి ఇప్పుడు అవసరం’ అని ఆయన పేర్కొన్నారు.
VIDEO | Indore: Speaking after inaugurating Madhav Srishti Arogya Kendra set up by philanthropic organisation 'Guruji Seva Nyas' for affordable treatment of cancer, Rashtriya Swayamsevak Sangh chief Mohan Bhagwat stressed on "Dharma", which unites and uplifts society, rather than… pic.twitter.com/xdd3kdT8EN
— Press Trust of India (@PTI_News) August 10, 2025
ప్రకృతి వైద్యం, హోమియోపతి లేదా అల్లోపతి మొదలైనవి ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడతాయిని పేర్కొంటూ, పాశ్చాత్య వైద్య పరిశోధనను భారతీయ పరిస్థితులకు గుడ్డిగా అన్వయించకూడదని భగవత్ హెచ్చరించారు. భారతీయ వైద్య విధానాలు వ్యక్తిగత అవసరాల ఆధారంగా చికిత్సను అందిస్తాయని ఆయన అన్నారు. కాగా దేశంలోని విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని భగవత్ పేర్కొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత లాంటి సాంకేతిక పదాలను ఆయన తిరస్కరించారు. సేవ చేసే సందర్భంలో ధర్మం అనేది మనకు ఆధారంగా నిలవాలన్నారు.