
సరిహద్దు ఉద్రిక్తతపై మెహబూబా ముఫ్తీ
ఇరుదేశాలు సంయమనం పాటించాలని పిలుపు
శ్రీనగర్: భారత్– పాక్ మధ్య నెలకొన్న సమస్యలను రాజకీయ జోక్యమే పరిష్కరిస్తుందని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. సైనిక చర్య సరికాదని, ఇరు దేశాల నాయకత్వాలు సంయమనం పాటించి, దాడులను తక్షణమే నిలిపివేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘పుల్వామా, పహల్గాం ఘటనలు రెండు దేశాలను విపత్తు అంచులకు చేర్చాయి. ఇది ఇలాగే కొనసాగితే యావత్ ప్రపంచానికే ప్రమాదం పొంచి ఉంది.
కార్గిల్ అయినా, పుల్వామా అయినా, పహల్గాం అయినా, పఠాన్ కోట్ అయినా సైనిక చర్య జరిగినప్పుడల్లా అది లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తుంది. మూల సమస్యకు పరిష్కారం చూపదు. శాశ్వతంగా శాంతిని నెలకొల్పేందుకు సహాయపడదు’అని ముఫ్తీ అన్నారు. ఉద్రిక్తతల వల్ల జమ్ముకశ్మీర్‌కు ఇరువైపులా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధాన్ని వారు ప్రారంభించలేదని, తమ ప్రమేయం లేకుండా జరుగుతున్న యుద్ధానికి వారు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని ఆమె అన్నారు.
జమ్మూకశ్మీర్ ప్రజలు ఎన్నాళ్లు ఈ భారాన్ని భరించాలంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దాడుల్లో ఇరు దేశాలు తమ లక్ష్యాన్ని నెరవేర్చినట్లు కనిపిస్తోందని, పిల్లల రక్తం ఎందుకు చిమ్ముతున్నారని ఆమె ప్రశ్నించారు. ఇరు దేశాల ప్రధానులు మాట్లాడి దాడులను ఆపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నాయకత్వం జమ్మూకశ్మీర్ ప్రజల గొంతుకను వింటుందని తాను ఆశిస్తున్నానన్నారు. రెండు వైపులా మీడియా నిజాలు మాట్లాడాలని, వారి ప్రచారాలతో ప్రజలకు భయాందోళనలు కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు.