టార్గెట్‌ జీపీఎస్‌ | GPS Interference Threatens Global Navigation for Flights and Ships | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ జీపీఎస్‌

Jul 1 2025 4:18 AM | Updated on Jul 1 2025 4:18 AM

GPS Interference Threatens Global Navigation for Flights and Ships

హడలిపోతున్న ప్రపంచ దేశాలు

గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌కు జామింగ్, స్నూపింగ్‌ ముప్పు

1970 నుంచి జీపీఎస్‌పైనే ఆధారపడుతున్న విమానయాన రంగం

ఇది ప్రమాదకరమంటున్న నిపుణులు

ఆటోమేటిక్‌ క్లాక్‌ విధానం ప్రత్యామ్నాయమని సూచన

ఆ దిశగా పరిశోధనలు చేపట్టిన భారత్‌ సహా పలు దేశాలు

జీపీఎస్‌ జామింగ్‌... జీపీఎస్‌ స్నూపింగ్‌...! ప్రస్తుతం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న రెండు పదాలు ఇవి...! గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) పనిచేయకుండా అడ్డుకోవడం, తప్పుదారి పట్టించడమే జామింగ్, స్నూపింగ్‌. విమానయాన రంగంతో పాటు టెలి కమ్యూనికేషన్లు, విద్యుత్తు తదితర కీలక రంగాలు పూర్తిగా ఆధారపడుతున్న జీపీఎస్‌ను శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా విమానయాన రంగం హడలెత్తిపోతోంది. దాంతో జీపీఎస్‌కు ప్రత్యామ్నాయ సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దిశగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు పరిశోధనలు వేగిరం చేశాయి.

సాక్షి, అమరావతి: విమానయాన రంగం పూర్తిగా ఆధారపడుతున్న జీపీఎస్‌ను జామింగ్, స్నూపింగ్‌ బెడద హడలెత్తిస్తోంది. ప్రధానంగా రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా దేశాల్లో తరచూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఇది తీవ్ర ఆందోళనకర అంశంగా మారింది.తూర్పు యూరప్‌లోని నాటో దేశాల విమానాల్లో జీపీఎస్‌ వ్యవస్థ కొంతకాలంగా తరచూ జామింగ్, స్నూపింగ్‌కు గురవుతోంది. రష్యా ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోందని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి. 2024 మార్చిలో అమెరికా రక్షణ మంత్రి ప్రయాణిస్తున్న విమానంలోని జీపీఎస్‌ కాసేపు సిగ్నల్స్‌ కోల్పోయింది.

ఇది రష్యా భూభాగానికి సమీపంలోనే జరగడం గమనార్హం. ఇక పాకిస్తాన్‌ సరిహద్దుకు సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో భారత పౌర, వాయుసేన విమానాల జీపీఎస్‌లో సమస్య తలెత్తుతోంది. ఈ తరహా ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా రెండు, మూడేళ్లుగా తరచూ సంభవిస్తున్నాయి. అయితే, ఇదేమీ కాకతాళీయం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు తాము లక్ష్యంగా చేసుకున్న విమానాల జీపీఎస్‌ను జామింగ్‌/సూ్నపింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న­ట్లు తేల్చిచెబుతున్నారు. ఇది విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సిన అనివార్యత ఏర్పడుతుందని, కూ­లి­పోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. 

ఏమిటీ జామింగ్‌?
విమానాల గమనాన్ని నిర్దేశించే జీపీఎస్‌ను జామింగ్‌ చేసి సిగ్నల్స్‌ అందకుండా చేసే వ్యవస్థ అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. జీపీఎస్‌లో ఉండే ఆటోమేటిక్‌ క్లాక్స్‌ను కొన్ని క్షణాల పాటు పనిచేయకుండా అడ్డుకోవడమే జామింగ్‌. ఇక తప్పుడు సిగ్నల్స్‌ను పంపి జీపీఎస్‌ను దారిమళి్లంచడమే స్నూపింగ్‌. సాధారణంగా దేశాల సైనిక టెక్నాలజీ నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉండే  జామింగ్, స్నూపింగ్‌ క్రమంగా ఉగ్రవాద సంస్థలకు కూడా అందుబాటులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే అతి తక్కువ ధర కలిగిన ఉపకరణాలతో కూడా జీపీఎస్‌ను జామింగ్, స్నూపింగ్‌ చేస్తుండడం ప్రమాద ఘంటికేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 సైనిక అవసరాల కోసం 1970లో రూపొందించిన గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం(జీపీఎస్‌) తర్వాతి కాలంలో అత్యంత కీలక సాంకేతిక వ్యవస్థగా మారింది.
ప్రధానంగా విమానయాన రంగంలో అత్యంత కీలకమైంది. అంతేకాదు టెలీ కమ్యూనికేషన్లు, విద్యుత్‌ గ్రిడ్లు తదితర రంగాలన్నీ కూడా డేటా బదిలీకి జీపీఎస్‌పైనే ఆధారపడుతున్నాయి. 

ఉపగ్రహ ఆధారితంగా అత్యంత కచ్చితత్వ (హై యాక్యురేట్‌) ఆటోమేటిక్‌ క్లాక్స్‌ కలిగి భూమిపైకి బ్రాడ్‌కాస్టింగ్‌ సిగ్నల్స్‌ అందించడంలో జీపీఎస్‌ అత్యంత సమర్థంగా పనిచేస్తోంది. భూమిపై ఉండే రిసీవర్‌ ఆ సిగ్నల్స్‌ను గ్రహించి తమ కచ్చితమైన గమ్యస్థానం, చేరుకునే సమయాన్ని గుర్తిస్తాయి. ఇదంతా మెరుపు వేగంతో అంటే సెకనులో వందకోట్ల వంతు వేగంతో సాగిపోతుంది. ఈ సిగ్నల్స్‌ భూమిపైకి చేరడంలో అంతరాయం కలిగిస్తే ఆటోమేటిక్‌ క్లాక్స్‌ సింక్రనైజేషన్‌ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తద్వారా జీపీఎస్‌ కచ్చితత్వం దెబ్బతింటుంది.

ప్రత్యామ్నాయ వ్యవస్థ అత్యవసరం
ప్రపంచ దేశాలు జీపీఎస్‌పై పూర్తిగా ఆధారపడడం అత్యంత ప్రమాదకరమని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలు కూడా జామింగ్‌/సూ్నపింగ్‌  సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో మరింత పటిష్ఠ ప్రత్యామ్నాయ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉపగ్రహ ఆధారితంగా పనిచేసే జీపీఎస్‌కు పోర్టబుల్‌ ఆటోమేటిక్‌ క్లాక్స్‌ను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇవి భూమిపైన, విమానాలు, ఇతర వ్యవస్థల నావిగేషన్‌ సిస్టంలోనే అంతర్భాగంగా ఏర్పాటు చేయాలని.. దీంతో ఉపగ్రహ ఆధారిత టైమ్‌పైనే పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం ఉండద­ని సలహా ఇస్తున్నారు. తద్వారా కచ్చితమైన వేగం, ప్రయాణ దిశ, నావిగేషన్‌ను గుర్తించగలమని చెబుతున్నారు.

బయటినుంచి వచ్చే సిగ్నల్స్‌పైనే ఆధారపడాల్సిన అనివార్యత తప్పుతుందని వివరిస్తున్నారు. ఈ దిశగా యూకేకు చెందిన నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌పీఎల్‌) కార్యాచరణకు ఉపక్రమించింది. క్వాంటమ్‌ టైమింగ్‌ పరిజ్ఞానంపై పరిశోధనలు చేస్తోంది. జీపీఎస్‌ ఆధారపడే ఉపగ్రహ ఆధారిత మైక్రోవేవ్‌ సేసియమ్‌ క్లాక్స్‌ కంటే లేజర్‌ కిరణాలతో ఆప్లికల్‌ క్లాక్స్‌ వ్యవస్థను రూపొందించే దిశగా పరిశోధనలు వేగవంతం చేసింది. ఈ క్లాక్స్‌ జీపీఎస్‌ కంటే వందరెట్లు కచ్చితత్వాన్ని అందిస్తాయని ఎన్‌పీఎల్‌ పరిశోధకులు చెబుతున్నారు. జాతీయ భద్రత, విమానయాన, విద్యుత్, టెలీకమ్యూనికేషన్ల రంగాల్లో విస్తృతంగా ఉపయోగించేలా 2030 నాటికి అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

అమెరికా కూడా ‘టిక్వెర్‌’ అనే పేరుతో ఆటోమేటిక్‌ క్లాక్‌ వ్యవస్థ దిశగా పరిశోధనలు చేస్తోంది. నాసా సహకారంతో అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రత్యేకంగా గ్రావిటీ మ్యాపింగ్‌ ప్రాజెక్టును కూడా చేపట్టింది.
 ఆస్ట్రేలియా ‘క్యూ–సీటీఆర్‌ఎల్‌’ పేరుతో పరిశోధన ప్రాజెక్టుపై పనిచేస్తోంది. 
భారత్‌ ఇప్పటికే జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా ‘నావిక్‌’ అనే వ్యవస్థను రూపొందించి పరీక్షిస్తోంది. మరింత విస్తృతపరిచే దిశగా పరిశోధనలు వేగిరం చేసింది.

ఆగితే భారీ మూల్యం చెల్లించాల్సిందే
జీపీఎస్‌కు అంతరాయం కలిగితే ప్రపంచ దేశాల విమానయాన, టెలీ కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్క రోజు జీపీఎస్‌ పనిచేయకపోతే బిలియన్‌ డాలర్లు నష్టపోతామని అమెరికా ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌–టెక్నాలజీ’ నివేదిక వెల్లడించింది. బ్రిటన్‌ అయితే ఏకంగా 2.14 బిలియన్‌ పౌండ్లు నష్టపోతుందని చెప్పింది. జీపీఎస్‌ పనిచేయకపోతే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల  భద్రత ప్రమాదంలో పడుతుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement