breaking news
global navigation satellite system
-
టార్గెట్ జీపీఎస్
జీపీఎస్ జామింగ్... జీపీఎస్ స్నూపింగ్...! ప్రస్తుతం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న రెండు పదాలు ఇవి...! గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పనిచేయకుండా అడ్డుకోవడం, తప్పుదారి పట్టించడమే జామింగ్, స్నూపింగ్. విమానయాన రంగంతో పాటు టెలి కమ్యూనికేషన్లు, విద్యుత్తు తదితర కీలక రంగాలు పూర్తిగా ఆధారపడుతున్న జీపీఎస్‌ను శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా విమానయాన రంగం హడలెత్తిపోతోంది. దాంతో జీపీఎస్‌కు ప్రత్యామ్నాయ సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దిశగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు పరిశోధనలు వేగిరం చేశాయి.సాక్షి, అమరావతి: విమానయాన రంగం పూర్తిగా ఆధారపడుతున్న జీపీఎస్‌ను జామింగ్, స్నూపింగ్ బెడద హడలెత్తిస్తోంది. ప్రధానంగా రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా దేశాల్లో తరచూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఇది తీవ్ర ఆందోళనకర అంశంగా మారింది.తూర్పు యూరప్‌లోని నాటో దేశాల విమానాల్లో జీపీఎస్ వ్యవస్థ కొంతకాలంగా తరచూ జామింగ్, స్నూపింగ్‌కు గురవుతోంది. రష్యా ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోందని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి. 2024 మార్చిలో అమెరికా రక్షణ మంత్రి ప్రయాణిస్తున్న విమానంలోని జీపీఎస్ కాసేపు సిగ్నల్స్ కోల్పోయింది.ఇది రష్యా భూభాగానికి సమీపంలోనే జరగడం గమనార్హం. ఇక పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో భారత పౌర, వాయుసేన విమానాల జీపీఎస్‌లో సమస్య తలెత్తుతోంది. ఈ తరహా ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా రెండు, మూడేళ్లుగా తరచూ సంభవిస్తున్నాయి. అయితే, ఇదేమీ కాకతాళీయం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు తాము లక్ష్యంగా చేసుకున్న విమానాల జీపీఎస్‌ను జామింగ్/సూ్నపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేల్చిచెబుతున్నారు. ఇది విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన అనివార్యత ఏర్పడుతుందని, కూలిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఏమిటీ జామింగ్?విమానాల గమనాన్ని నిర్దేశించే జీపీఎస్‌ను జామింగ్ చేసి సిగ్నల్స్ అందకుండా చేసే వ్యవస్థ అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. జీపీఎస్‌లో ఉండే ఆటోమేటిక్ క్లాక్స్‌ను కొన్ని క్షణాల పాటు పనిచేయకుండా అడ్డుకోవడమే జామింగ్. ఇక తప్పుడు సిగ్నల్స్‌ను పంపి జీపీఎస్‌ను దారిమళి్లంచడమే స్నూపింగ్. సాధారణంగా దేశాల సైనిక టెక్నాలజీ నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉండే జామింగ్, స్నూపింగ్ క్రమంగా ఉగ్రవాద సంస్థలకు కూడా అందుబాటులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆన్లైన్లో అందుబాటులో ఉండే అతి తక్కువ ధర కలిగిన ఉపకరణాలతో కూడా జీపీఎస్‌ను జామింగ్, స్నూపింగ్ చేస్తుండడం ప్రమాద ఘంటికేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.⇒ సైనిక అవసరాల కోసం 1970లో రూపొందించిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(జీపీఎస్) తర్వాతి కాలంలో అత్యంత కీలక సాంకేతిక వ్యవస్థగా మారింది.⇒ ప్రధానంగా విమానయాన రంగంలో అత్యంత కీలకమైంది. అంతేకాదు టెలీ కమ్యూనికేషన్లు, విద్యుత్ గ్రిడ్లు తదితర రంగాలన్నీ కూడా డేటా బదిలీకి జీపీఎస్‌పైనే ఆధారపడుతున్నాయి. ⇒ ఉపగ్రహ ఆధారితంగా అత్యంత కచ్చితత్వ (హై యాక్యురేట్) ఆటోమేటిక్ క్లాక్స్ కలిగి భూమిపైకి బ్రాడ్‌కాస్టింగ్ సిగ్నల్స్ అందించడంలో జీపీఎస్ అత్యంత సమర్థంగా పనిచేస్తోంది. భూమిపై ఉండే రిసీవర్ ఆ సిగ్నల్స్‌ను గ్రహించి తమ కచ్చితమైన గమ్యస్థానం, చేరుకునే సమయాన్ని గుర్తిస్తాయి. ఇదంతా మెరుపు వేగంతో అంటే సెకనులో వందకోట్ల వంతు వేగంతో సాగిపోతుంది. ఈ సిగ్నల్స్ భూమిపైకి చేరడంలో అంతరాయం కలిగిస్తే ఆటోమేటిక్ క్లాక్స్ సింక్రనైజేషన్ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తద్వారా జీపీఎస్ కచ్చితత్వం దెబ్బతింటుంది.ప్రత్యామ్నాయ వ్యవస్థ అత్యవసరంప్రపంచ దేశాలు జీపీఎస్‌పై పూర్తిగా ఆధారపడడం అత్యంత ప్రమాదకరమని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలు కూడా జామింగ్/సూ్నపింగ్ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో మరింత పటిష్ఠ ప్రత్యామ్నాయ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉపగ్రహ ఆధారితంగా పనిచేసే జీపీఎస్‌కు పోర్టబుల్ ఆటోమేటిక్ క్లాక్స్‌ను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇవి భూమిపైన, విమానాలు, ఇతర వ్యవస్థల నావిగేషన్ సిస్టంలోనే అంతర్భాగంగా ఏర్పాటు చేయాలని.. దీంతో ఉపగ్రహ ఆధారిత టైమ్‌పైనే పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదని సలహా ఇస్తున్నారు. తద్వారా కచ్చితమైన వేగం, ప్రయాణ దిశ, నావిగేషన్‌ను గుర్తించగలమని చెబుతున్నారు.బయటినుంచి వచ్చే సిగ్నల్స్‌పైనే ఆధారపడాల్సిన అనివార్యత తప్పుతుందని వివరిస్తున్నారు. ఈ దిశగా యూకేకు చెందిన నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (ఎన్పీఎల్) కార్యాచరణకు ఉపక్రమించింది. క్వాంటమ్ టైమింగ్ పరిజ్ఞానంపై పరిశోధనలు చేస్తోంది. జీపీఎస్ ఆధారపడే ఉపగ్రహ ఆధారిత మైక్రోవేవ్ సేసియమ్ క్లాక్స్ కంటే లేజర్ కిరణాలతో ఆప్లికల్ క్లాక్స్ వ్యవస్థను రూపొందించే దిశగా పరిశోధనలు వేగవంతం చేసింది. ఈ క్లాక్స్ జీపీఎస్ కంటే వందరెట్లు కచ్చితత్వాన్ని అందిస్తాయని ఎన్పీఎల్ పరిశోధకులు చెబుతున్నారు. జాతీయ భద్రత, విమానయాన, విద్యుత్, టెలీకమ్యూనికేషన్ల రంగాల్లో విస్తృతంగా ఉపయోగించేలా 2030 నాటికి అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ⇒ అమెరికా కూడా ‘టిక్వెర్’ అనే పేరుతో ఆటోమేటిక్ క్లాక్ వ్యవస్థ దిశగా పరిశోధనలు చేస్తోంది. నాసా సహకారంతో అమెరికా జియోలాజికల్ సర్వే ప్రత్యేకంగా గ్రావిటీ మ్యాపింగ్ ప్రాజెక్టును కూడా చేపట్టింది.⇒ ఆస్ట్రేలియా ‘క్యూ–సీటీఆర్ఎల్’ పేరుతో పరిశోధన ప్రాజెక్టుపై పనిచేస్తోంది. ⇒ భారత్ ఇప్పటికే జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా ‘నావిక్’ అనే వ్యవస్థను రూపొందించి పరీక్షిస్తోంది. మరింత విస్తృతపరిచే దిశగా పరిశోధనలు వేగిరం చేసింది.ఆగితే భారీ మూల్యం చెల్లించాల్సిందేజీపీఎస్కు అంతరాయం కలిగితే ప్రపంచ దేశాల విమానయాన, టెలీ కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్క రోజు జీపీఎస్ పనిచేయకపోతే బిలియన్ డాలర్లు నష్టపోతామని అమెరికా ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్–టెక్నాలజీ’ నివేదిక వెల్లడించింది. బ్రిటన్ అయితే ఏకంగా 2.14 బిలియన్ పౌండ్లు నష్టపోతుందని చెప్పింది. జీపీఎస్ పనిచేయకపోతే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల భద్రత ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. -
హెచ్ఎండీఏ మినహా..రాష్ట్రమంతా భూముల సర్వే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ భూముల పూర్తిస్థాయి సర్వేకు ప్రభుత్వం పకడ్బందీగా సిద్ధమవుతోంది. భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉండేలా అత్యాధునిక పద్ధతుల్లో సర్వే నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వెరీ హైరిజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ (వీహెచ్‌ఆర్‌ఎస్‌ఐ) వ్యవస్థను వినియోగించి సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించింది కూడా. ఈ సర్వే ప్రక్రియలో చట్టపరమైన సమస్యలు రాకుండా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. సర్వే అయ్యాక భూముల రికార్డులను తనిఖీ చేసి యజమానులకు నోటీసులు జారీ చేయాలని, అప్పీళ్లు వస్తే వాటన్నింటినీ పరిష్కరించాకే తుది రికార్డులను నమోదు చేయాలని భావిస్తోంది. జియో రిఫరెన్స్.. ఫోటోగ్రామెట్రీ సాఫ్ట్వేర్లతో.. రాష్ట్రంలో మొత్తం భూవిస్తీర్ణం 1.12 లక్షల చదరపు కిలోమీటర్లుకాగా.. అందులో 77,916 చదరపు కిలోమీటర్ల పరిధిలోని వ్యవసాయ భూములను సర్వే చేయనున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోనికి వచ్చే ప్రాంతాల్లో, అటవీ భూముల్లో ఎలాగూ వ్యవసాయ భూములుండే అవకాశం లేనందున.. ఈ ప్రాంతాలను మినహాయించి మిగిలిన భూములను సర్వే చేయనున్నారు. ఇందుకోసం వీహెచ్‌ఆర్‌ఎస్‌ఐ విధానాన్ని వినియోగించాలని గతంలోనే నిర్ణయించారు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ద్వారా నిరంతరం పనిచేసేలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 రిఫరెన్స్ స్టేషన్లను ఏర్పాటు చేసి, కచ్చితమైన భూనియంత్రణ పాయింట్లను నిర్ధారించనున్నారు. ఈ పాయింట్ల నుంచి 28 సెంటీమీటర్ల స్థాయి వరకు రిజల్యూషన్ ఉండే శాటిలైట్ ఇమేజ్‌లను సేకరించి.. వాటిని జియో రిఫరెన్స్, ఫోటోగ్రామెట్రీ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి ఆర్థోఫోటోలను తయారు చేస్తారు. ఆ ఫోటోల ఆధారంగా ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్లలో కమతాల సరిహద్దులను క్యాప్చర్ చేసి.. భూహక్కుల రికార్డుల్లోని (ఆర్ఓఆర్) ఆధారంగా సదరు కమతానికి అనుసంధానం చేస్తారు. ఈ వివరాలను ఏకీకృత భూసమాచార వ్యవస్థకు అనుసంధానం చేసి.. రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్, భూరికార్డుల శాఖల సమక్షంలో తనిఖీ చేస్తారు. ఆ తర్వాత తుది సర్వే రికార్డులు నమోదు చేస్తారు. దేనికెంత ఖర్చు? రాష్ట్రంలో డిజిటల్ విధానంలో భూముల సర్వేకు అయ్యే ఖర్చు వివరాలను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెవెన్యూ శాఖ అవుట్‌కమ్ బడ్జెట్లో పేర్కొన్నారు. ఒక చదరపు కిలోమీటర్లో 28 సెంటీమీటర్ల రిజల్యూషన్ ఉన్న శాటిలైట్ ఇమేజ్‌ల కోసం రూ.4,000 చొప్పున ఖర్చవుతుందని.. దాదాపు 80వేల చదరపు కిలోమీటర్లకు గాను రూ.32 కోట్లు అవసరమని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక అటవీ సరిహద్దు ప్రాంతాలను లైడార్ పద్ధతిలో స్కానింగ్ చేసేందుకు రూ.11 కోట్లు ఖర్చవుతాయని.. మండలానికో రిఫరెన్స్ స్టేషన్ ఏర్పాటు చేసి సీవోఆర్‌ఎస్ నెట్వర్క్ సాయంతో 600 రోవర్స్ సమకూర్చేందుకు రూ.30 కోట్లు వ్యయం కావచ్చని అంటున్నాయి. మరోవైపు భూనియంత్రణ పాయింట్ నెట్వర్క్ ఏర్పాటు, గ్రౌండ్ టూతింగ్ కోసం చరదపు కిలోమీటర్‌కు రూ.42 వేల చొప్పున మొత్తం రూ.327 కోట్లు కానుందని అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద రూ.400 కోట్ల మేర వ్యయం అవుతుందని చెబుతున్నారు. బడ్జెట్లో నిధులు కూడా కేటాయించన నేపథ్యంలో.. ఈ ఏడాదిలోనే వ్యవసాయ భూముల డిజిటల్ రీసర్వే చేసే చాన్స్ ఉందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. సర్వే కోసం ప్రభుత్వం తీసుకున్న భూవిస్తీర్ణ గణాంకాలు (చదరపు కిలోమీటర్లలో) రాష్ట్రం మొత్తం విస్తీర్ణం: 1,12,077 అటవీ ప్రాంతం: 26,904 మిగిలిన ప్రాంతం: 85,173 హెచ్ఎండీఏ ప్రాంతం: 7,257 ఇమేజరీ సేకరించాల్సిన ప్రాంతం: 77,916 (హెచ్ఎండీఏ, అటవీ ప్రాంతాలు మినహా) -
ఇక ఉపగ్రహాల సాయంతో సాగు
తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వ్యవసాయాభి వృద్ధి లో ఉపగ్రహాల రిమోట్ సెన్సింగ్ కీలక పాత్ర పోషించ నుంది. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా వ్యవసాయా న్ని లాభసాటి చేసేందుకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియో గంలోకి రానుంది. ప్రపంచంలో ఏదైనా ప్రాంత సమాచారాన్ని నిర్దిష్టంగా గుర్తించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (జీఎన్ ఎస్ఎస్), ఉపగ్రహ ఆధారిత భూ సమాచారం(రిమోట్ సెన్సింగ్), ఓ ప్రాంతంలోని భూమి స్థితిగతులకు (ప్రాక్సిమల్ డేటా) సంబంధించిన సమాచారంతో ఆధునిక వ్యవసాయాన్ని చేపట్టేలా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. భూ ఉపరితలంపై పర్యావరణ ప్రభావాన్ని మదింపు చేసేందుకూ ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా రైతులు తమకు అనువైన పంటలు ఏమిటో, భూ సారం ఎంతో, ఒకవేళ పంటలు వేసి ఉంటే వాటి దిగుబడి ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు.