హెచ్‌ఎండీఏ మినహా..రాష్ట్రమంతా భూముల సర్వే! | Telangana Government Likely To Go For Land Survey Across The State | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎండీఏ మినహా..రాష్ట్రమంతా భూముల సర్వే!

Mar 24 2021 2:23 AM | Updated on Mar 24 2021 2:24 AM

Telangana Government Likely To Go For Land Survey Across The State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ భూముల పూర్తిస్థాయి సర్వేకు ప్రభుత్వం పకడ్బందీగా సిద్ధమవుతోంది. భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉండేలా అత్యాధునిక పద్ధతుల్లో సర్వే నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వెరీ హైరిజల్యూషన్‌ శాటిలైట్‌ ఇమేజరీ (వీహెచ్‌ఆర్‌ఎస్‌ఐ) వ్యవస్థను వినియోగించి సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించింది కూడా. ఈ సర్వే ప్రక్రియలో చట్టపరమైన సమస్యలు రాకుండా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. సర్వే అయ్యాక భూముల రికార్డులను తనిఖీ చేసి యజమానులకు నోటీసులు జారీ చేయాలని, అప్పీళ్లు వస్తే వాటన్నింటినీ పరిష్కరించాకే తుది రికార్డులను నమోదు చేయాలని భావిస్తోంది. 

జియో రిఫరెన్స్‌.. ఫోటోగ్రామెట్రీ సాఫ్ట్‌వేర్‌లతో..
రాష్ట్రంలో మొత్తం భూవిస్తీర్ణం 1.12 లక్షల చదరపు కిలోమీటర్లుకాగా.. అందులో 77,916 చదరపు కిలోమీటర్ల పరిధిలోని వ్యవసాయ భూములను సర్వే చేయనున్నారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలోనికి వచ్చే ప్రాంతాల్లో, అటవీ భూముల్లో ఎలాగూ వ్యవసాయ భూములుండే అవకాశం లేనందున.. ఈ ప్రాంతాలను మినహాయించి మిగిలిన భూములను సర్వే చేయనున్నారు. ఇందుకోసం వీహెచ్‌ఆర్‌ఎస్‌ఐ విధానాన్ని వినియోగించాలని గతంలోనే నిర్ణయించారు.

గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (జీఎన్‌ఎస్‌ఎస్‌) ద్వారా నిరంతరం పనిచేసేలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 రిఫరెన్స్‌ స్టేషన్లను ఏర్పాటు చేసి, కచ్చితమైన భూనియంత్రణ పాయింట్లను నిర్ధారించనున్నారు. ఈ పాయింట్ల నుంచి 28 సెంటీమీటర్ల స్థాయి వరకు రిజల్యూషన్‌ ఉండే శాటిలైట్‌ ఇమేజ్‌లను సేకరించి.. వాటిని జియో రిఫరెన్స్, ఫోటోగ్రామెట్రీ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి ఆర్థోఫోటోలను తయారు చేస్తారు. ఆ ఫోటోల ఆధారంగా ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లలో కమతాల సరిహద్దులను క్యాప్చర్‌ చేసి.. భూహక్కుల రికార్డుల్లోని (ఆర్‌ఓఆర్‌) ఆధారంగా సదరు కమతానికి అనుసంధానం చేస్తారు. ఈ వివరాలను ఏకీకృత భూసమాచార వ్యవస్థకు అనుసంధానం చేసి.. రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్, భూరికార్డుల శాఖల సమక్షంలో తనిఖీ చేస్తారు. ఆ తర్వాత తుది సర్వే రికార్డులు నమోదు చేస్తారు.

దేనికెంత ఖర్చు?
రాష్ట్రంలో డిజిటల్‌ విధానంలో భూముల సర్వేకు అయ్యే ఖర్చు వివరాలను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెవెన్యూ శాఖ అవుట్‌కమ్‌ బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఒక చదరపు కిలోమీటర్‌లో 28 సెంటీమీటర్ల రిజల్యూషన్‌ ఉన్న శాటిలైట్‌ ఇమేజ్‌ల కోసం రూ.4,000 చొప్పున ఖర్చవుతుందని.. దాదాపు 80వేల చదరపు కిలోమీటర్లకు గాను రూ.32 కోట్లు అవసరమని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక అటవీ సరిహద్దు ప్రాంతాలను లైడార్‌ పద్ధతిలో స్కానింగ్‌ చేసేందుకు రూ.11 కోట్లు ఖర్చవుతాయని.. మండలానికో రిఫరెన్స్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసి సీవోఆర్‌ఎస్‌ నెట్‌వర్క్‌ సాయంతో 600 రోవర్స్‌ సమకూర్చేందుకు రూ.30 కోట్లు వ్యయం కావచ్చని అంటున్నాయి.

మరోవైపు భూనియంత్రణ పాయింట్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు, గ్రౌండ్‌ టూతింగ్‌ కోసం చరదపు కిలోమీటర్‌కు రూ.42 వేల చొప్పున మొత్తం రూ.327 కోట్లు కానుందని అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద రూ.400 కోట్ల మేర వ్యయం అవుతుందని చెబుతున్నారు. బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించన నేపథ్యంలో.. ఈ ఏడాదిలోనే వ్యవసాయ భూముల డిజిటల్‌ రీసర్వే చేసే చాన్స్‌ ఉందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి.

సర్వే కోసం ప్రభుత్వం తీసుకున్న భూవిస్తీర్ణ గణాంకాలు (చదరపు కిలోమీటర్లలో)

రాష్ట్రం మొత్తం విస్తీర్ణం: 1,12,077
అటవీ ప్రాంతం: 26,904
మిగిలిన ప్రాంతం: 85,173 
హెచ్‌ఎండీఏ ప్రాంతం: 7,257
ఇమేజరీ సేకరించాల్సిన ప్రాంతం: 77,916 (హెచ్‌ఎండీఏ, అటవీ ప్రాంతాలు మినహా)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement