
వీడు నిజంగానే మామూలోడు కాదు. వెరీ వెరీ టాలెండెడ్ టెర్రరిస్టు. దశాబ్దాలుగా పీవోకే నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఉగ్రమూకలు భారత్‌లోకి చొరబడేందుకు దారులు చెప్పి సాయం చేసేవాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. వందకి పైగా ఉగ్రవాద చొరబాట్లకు కారకుడయ్యాడు. అందుకే హ్యూమన్ జీపీఎస్ (human GPS)గా బాగూఖాన్(Bagu Khan)కు పేరు ముద్రపడింది.
జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక ఉగ్రవాది హతమయ్యాడు. దాదాపు 100పైగా ఉగ్రవాద చొరబాట్లకు కారకుడు, హ్యూమన్ జీపీఎస్‌గా పిలవబడే బాగూఖాన్(సమందర్ చాచా)ను కాల్చిచంపినట్లు ఆర్మీవర్గాలు వెల్లడించాయి. అతడు మరో ఉగ్రవాదితో కలిసి దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ జరిగిందని తెలిపాయి.
1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి బాగూఖాన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఎలాంటి కఠిన మార్గాల్లోనైనా ఉగ్రమూకలు భారత్‌లోకి చొరబడేందుకు ఇతడు సహాయం చేసేవాడని, అందులో ఎక్కువభాగం విజయవంతం అయ్యాయని పేర్కొన్నాయి. అతడు హిజ్బుల్ కమాండర్‌గా ఉన్ననప్పటికీ.. ఈ టాలెంట్(భౌగోళిక పరిజ్ఞానం) వల్ల అన్ని ఉగ్రసంస్థలకు అతడు కీలకంగా మారాడు. ఈ క్రమంలోనే హ్యుమన్ జీపీఎస్‌గా అతనికంటూ ఓ పేరు ముద్రపడింది.
భద్రతా బలగాల విజయాలు: ఈ ఎన్‌కౌంటర్‌తో పాటు, గత కొన్ని నెలల్లో జమ్మూకశ్మీర్‌లో 23 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. ఇందులో పాకిస్థానీయులు, స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. బాగూఖాన్ ఎన్‌కౌంటర్‌తో నౌషెరా ప్రాంతంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు. భద్రతా బలగాలు ఇంకా ఇతర దాగిన ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.