
పేజర్ తరహాలో ఉండేఉపకరణాల కేటాయింపు
వారు విధుల్లో అప్రమత్తంగాఉన్నదీలేనిదీ నిరంతర ట్రాకింగ్
దక్షిణ మధ్య రైల్వేలో 1,600 మంది సిబ్బందికి ఏర్పాటు..
మిగతావారికి నెల రోజుల్లో
గతేడాది సెప్టెంబర్ ఒకటో తేదీ.. భారీ వర్షం కురిసింది. కేసముద్రం–ఇంటెకన్నె సెక్షన్‌ల మధ్య అర్ధరాత్రి వేళ రైల్వే కీమెన్ ట్రాక్ పెట్రోలింగ్‌లో ఉన్నాడు. ఎడతెగని వర్షం వల్ల అయోధ్యపురం చెరువులోకి వరద పోటెత్తి కట్ట తెగింది. దీంతో రైల్వే ట్రాక్ వద్ద మట్టి కొట్టుకుపోతున్న విషయాన్ని కీమెన్ గుర్తించి వెంటనే వైర్‌లెస్ సెట్ ద్వారా అధికారులకు సమాచారం అందించాడు.
సరిగ్గా అదే సమయంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైళ్లు (అప్ అండ్ డౌన్ ట్రాక్ మీద వెళ్లే రెండు రైళ్లు) కేసముద్రం స్టేషన్‌కు చేరుకున్నాయి. వెంటనే అధికారులు వాటిని నిలిపేశారు. కాసేపటికే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. ఆరోజు కీమెన్ అప్రమత్తంగా ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పింది.. అదే కీమెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే... ?
సాక్షి, హైదరాబాద్ : పట్టాలపై రైళ్లు సురక్షితంగా పరుగుపెట్టడం వెనుక దేశవ్యాప్తంగా వేలమంది కీమెన్ (గ్యాంగ్‌మెన్) నిర్విరామ పహారానే ప్రధాన కారణం. అత్యంత కిందిస్థాయి ఉద్యోగులే అయినా.. రైల్వే భద్రతలో వీరిదే కీలక భూమిక. ప్రకృతి విపత్తులు, సంఘ విద్రోహ శక్తుల వల్ల రైళ్లకు పొంచి ఉండే ప్రమాదాన్ని తప్పించేది వీరే కావటంతో ఇప్పుడు వీరి విధులపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కీమెన్ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు వారిని నిరంతరం ట్రాక్ చేసే విధానాన్ని ప్రారంభించింది.
ఇందుకోసం పేజర్ తరహాలో ఉండే జీపీఎస్ ఉపకరణాన్ని వారికి ఏర్పాటు చేశారు. వారు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆ ఉపకరణాన్ని వెంటపెట్టుకొని వెళ్లాలి. వారు ఏయే మార్గాల్లో, ఏయే సమయాల్లో విధుల్లో ఉన్నారో ఆ ఉపకరణం ద్వారా డివిజన్ హెడ్ క్వార్టర్స్‌లో ఉండే కంట్రోల్ సెంటర్ నుంచి ట్రాక్ చేస్తారు. ఇందుకోసం కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు ట్రాకింగ్ కోసం సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ఫలితంగా కీ మెన్ ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా విధుల్లో ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో...
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుతం 2,800 మంది ట్రాక్ పర్యవేక్షణ విధుల్లో ఉన్నారు. వీరిలో 1,800 మంది కీమెన్ కాగా, ప్రత్యేక పెట్రోలింగ్ విధుల్లో మిగతా వారుంటారు. ఇప్పుడు వీరిలో 1,600 మందిని తాజాగా జీపీఎస్‌తో అనుసంధానం చేశారు. మిగతా వారిని మరో నెల రోజుల్లో దాని పరిధిలోకి తేనున్నారు.
వాస్తవానికి ట్రాక్ కీమెన్‌లో అప్రమత్తత పెంచేందుకు వారిని జీపీఎస్ ట్రాకింగ్ పరిధిలోకి తీసుకురావాలన్నది 2018లో తీసుకున్న నిర్ణయం. కానీ, దాన్ని అమలులోకి తేవటంలో తీవ్ర జాప్యం జరిగింది. కొన్ని రైల్వే జోన్‌లలో పాక్షికంగా అమలులోకి తె చ్చినా, పూర్తిస్థాయిలో జీపీఎస్ ట్రాకింగ్ విధానం ఏర్పాటు చేయలేకపోయారు.
భారీ వర్షాలప్పుడు మరింత అవసరం
భారీ వర్షాలప్పుడు ఏర్పడే మెరుపు వరదలు రైల్వేను అతలాకుతలం చేస్తున్నాయి. చెరువులు, వాగులు, గుట్ట దిగువన ఉండే ట్రాక్‌కు ఈ వరదలు ప్రమాదకరంగా మారుతాయి. దీంతో 24 గంటలు ట్రాక్‌పై నిఘా అవసరం. గత సంవత్సరం కేసముద్రం సమీపంలో ట్రాక్ దిగువన మట్టి కొట్టుకుపోయిన విషయాన్ని సకాలంలో గుర్తించటంతో భారీ ప్రమాదం తప్పింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ, వీలైనంత తొందరలో కీమెన్, పెట్రోలింగ్ మెన్‌కు జీపీఎస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి వేగంగా కసరత్తు పూర్తి చేసింది. ఈ వర్షాకాలం నాటికి మూడొంతుల మందిని ట్రాకింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు.