breaking news
gangmen
-
రైల్వే కీమెన్‌కు జీపీఎస్
గతేడాది సెప్టెంబర్ ఒకటో తేదీ.. భారీ వర్షం కురిసింది. కేసముద్రం–ఇంటెకన్నె సెక్షన్ల మధ్య అర్ధరాత్రి వేళ రైల్వే కీమెన్ ట్రాక్ పెట్రోలింగ్‌లో ఉన్నాడు. ఎడతెగని వర్షం వల్ల అయోధ్యపురం చెరువులోకి వరద పోటెత్తి కట్ట తెగింది. దీంతో రైల్వే ట్రాక్ వద్ద మట్టి కొట్టుకుపోతున్న విషయాన్ని కీమెన్ గుర్తించి వెంటనే వైర్లెస్ సెట్ ద్వారా అధికారులకు సమాచారం అందించాడు. సరిగ్గా అదే సమయంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైళ్లు (అప్ అండ్ డౌన్ ట్రాక్ మీద వెళ్లే రెండు రైళ్లు) కేసముద్రం స్టేషన్‌కు చేరుకున్నాయి. వెంటనే అధికారులు వాటిని నిలిపేశారు. కాసేపటికే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. ఆరోజు కీమెన్ అప్రమత్తంగా ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పింది.. అదే కీమెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే... ?సాక్షి, హైదరాబాద్ : పట్టాలపై రైళ్లు సురక్షితంగా పరుగుపెట్టడం వెనుక దేశవ్యాప్తంగా వేలమంది కీమెన్ (గ్యాంగ్‌మెన్) నిర్విరామ పహారానే ప్రధాన కారణం. అత్యంత కిందిస్థాయి ఉద్యోగులే అయినా.. రైల్వే భద్రతలో వీరిదే కీలక భూమిక. ప్రకృతి విపత్తులు, సంఘ విద్రోహ శక్తుల వల్ల రైళ్లకు పొంచి ఉండే ప్రమాదాన్ని తప్పించేది వీరే కావటంతో ఇప్పుడు వీరి విధులపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కీమెన్ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు వారిని నిరంతరం ట్రాక్ చేసే విధానాన్ని ప్రారంభించింది. ఇందుకోసం పేజర్ తరహాలో ఉండే జీపీఎస్ ఉపకరణాన్ని వారికి ఏర్పాటు చేశారు. వారు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆ ఉపకరణాన్ని వెంటపెట్టుకొని వెళ్లాలి. వారు ఏయే మార్గాల్లో, ఏయే సమయాల్లో విధుల్లో ఉన్నారో ఆ ఉపకరణం ద్వారా డివిజన్ హెడ్ క్వార్టర్స్‌లో ఉండే కంట్రోల్ సెంటర్ నుంచి ట్రాక్ చేస్తారు. ఇందుకోసం కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు ట్రాకింగ్ కోసం సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ఫలితంగా కీ మెన్ ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా విధుల్లో ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో...దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుతం 2,800 మంది ట్రాక్ పర్యవేక్షణ విధుల్లో ఉన్నారు. వీరిలో 1,800 మంది కీమెన్ కాగా, ప్రత్యేక పెట్రోలింగ్ విధుల్లో మిగతా వారుంటారు. ఇప్పుడు వీరిలో 1,600 మందిని తాజాగా జీపీఎస్‌తో అనుసంధానం చేశారు. మిగతా వారిని మరో నెల రోజుల్లో దాని పరిధిలోకి తేనున్నారు. వాస్తవానికి ట్రాక్ కీమెన్‌లో అప్రమత్తత పెంచేందుకు వారిని జీపీఎస్ ట్రాకింగ్ పరిధిలోకి తీసుకురావాలన్నది 2018లో తీసుకున్న నిర్ణయం. కానీ, దాన్ని అమలులోకి తేవటంలో తీవ్ర జాప్యం జరిగింది. కొన్ని రైల్వే జోన్లలో పాక్షికంగా అమలులోకి తె చ్చినా, పూర్తిస్థాయిలో జీపీఎస్ ట్రాకింగ్ విధానం ఏర్పాటు చేయలేకపోయారు. భారీ వర్షాలప్పుడు మరింత అవసరం భారీ వర్షాలప్పుడు ఏర్పడే మెరుపు వరదలు రైల్వేను అతలాకుతలం చేస్తున్నాయి. చెరువులు, వాగులు, గుట్ట దిగువన ఉండే ట్రాక్‌కు ఈ వరదలు ప్రమాదకరంగా మారుతాయి. దీంతో 24 గంటలు ట్రాక్‌పై నిఘా అవసరం. గత సంవత్సరం కేసముద్రం సమీపంలో ట్రాక్ దిగువన మట్టి కొట్టుకుపోయిన విషయాన్ని సకాలంలో గుర్తించటంతో భారీ ప్రమాదం తప్పింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ, వీలైనంత తొందరలో కీమెన్, పెట్రోలింగ్ మెన్‌కు జీపీఎస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి వేగంగా కసరత్తు పూర్తి చేసింది. ఈ వర్షాకాలం నాటికి మూడొంతుల మందిని ట్రాకింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. -
రైల్వే ఉద్యోగులకు ‘సీజీహెచ్ఎస్’ చికిత్స
న్యూఢిల్లీ: భద్రతా ప్రమాణాలను పెంచడంలో భాగంగా రైల్వే ఉద్యోగులకు పలు చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. లోకో పైలట్లు, ట్రాక్మెన్లు, గ్యాంగ్మెన్లకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) కింద ఫిజియో థెరపీ, వృత్తి సంబంధ థెరపీ, స్పీచ్ థెరపీ వంటి చికిత్సలను అందించనున్నారు. ఇప్పటి వరకు ఈ చికిత్సలు రైల్వే ఉద్యోగులకు అందుబాటులో లేవు. ఒక వేళ బయట వేరే చోట చికిత్స చేయించుకున్నా వారికి రీయింబర్స్మెంట్ ఉండేది కాదు. ‘రైల్వేలో పెద్ద సంఖ్యలో డ్రైవర్లు, ట్రాక్మెన్లు, గ్యాంగ్మెన్లు పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ప్రయాణికుల భద్రత వీరిపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో వారికి మెరుగైన చికిత్స అందించాలని నిర్ణయించాం’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
సమత ఎక్స్ ప్రెస్‌కు తప్పిన ముప్పు
విజయనగరం: ఎక్స్ ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. సమత ఎక్స్ ప్రెస్ రైలు(విశాఖ-హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ ) వెళ్లే మార్గంలో పట్టా విరిగినట్లు ముందుగానే గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరం జిల్లా మనాపురం వద్ద పట్టా విరిగినట్లు గ్యాంగ్ మెన్ గుర్తించాడు. రైల్వే అధికారులకు విషయం తెలిపాడు. దీంతో సమత ఎక్స్ ప్రెస్ రైలును అధికారులు ఆపివేయడంతో ముప్పు తప్పింది. ఆ మార్గంలో కొంత సమయం రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి. -
రైలు ప్రమాదంలో నలుగురి మృతి
సాక్షి, ముంబై: ముంబై నుంచి కొల్హాపూర్‌కు బయలుదేరిన కోయినా ఎక్స్‌ప్రెస్ నలుగురు గ్యాంగ్మెన్లను ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలంలోనే నలుగురు మృతి చెందారు. అందిన వివరాల మేరకు ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో టాకూర్లి-కళ్యాణ్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రతి రోజు మాదిరిగానే ఈ రోజు కూడా రైల్వేట్రాక్‌ను గ్యాంగ్మెన్లు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన కోయినా ఎక్స్‌ప్రెస్‌ను వీరు గమనించలేకపోయారు. రైలు ఒక్కసారిగా వారిని ఢీకొట్టి ముందుకు వెళ్లింది. దీంతో ఘటనాస్థలంలోనే కార్మికుల మృతదేహాలు నుజ్జనుజ్జయి కనిపించాయి. దీపావళి పర్వదినం నాడే ఈ దుర్ఘటన సంభవించడంతో మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. విచారణకు ఆదేశం... ఈ దుర్ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లోనూ విచారణ నిర్వహించాలని రైల్వేశాఖ ఆదేశాలు జారి చేసింది. నిబంధనల ప్రకారం ట్రాక్‌ను పరిశీలించాకే మరమ్మతులు ప్రారంభించాలి. మరమ్మతులు చేస్తున్న సమయంలో రైల్వే ఉద్యోగులు ఇద్దరు దూరంగా నిలబడి రైలు వస్తే వారిని పక్కకు తప్పుకోవాలని హెచ్చరించాలి. విజిల్ వేసి మరి హెచ్చరించాలి. అదే విధంగా ఒక్కోసారి ఎరుపు జెండా ఊపి రైలును కూడా ఆపుతుంటారు. కానీ నలుగురు గ్యాంగ్మెన్లు పనులు చేస్తున్నప్పుడు అక్కడ ఇలాంటి హెచ్చరికలు చేసే ఉద్యోగులు ఉన్నారా..? లేదా..? అనే విషయాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఒకవేళ రైలు డ్రైవర్ దృష్టికి కూడా రాలేదా..? వంటి ఇతర విషయాలపైనా విచారణ నిర్వహిస్తామని రైల్వేవర్గాలు తెలిపాయి.