
తేజేశ్వర్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి..!
సాంకేతిక పరిజ్ఞానంతో తిరుమలరావు పథక రచన
రెండోరోజు కొనసాగిన విచారణ
గద్వాల క్రైం: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ఆదివారం మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఏ–1 తిరుమలరావు, ఏ–2 ఐశ్వర్య అలియాస్ సహస్రలను రెండోరోజూ సీఐ శ్రీను విచారించారు. కర్నూలు జిల్లాలో ఉన్న సన్నిహిత పరిచయంలోనే తిరుమలరావు తన ప్రియురాలిపై విపరీతమైన వ్యామోహంతో నిత్యం నిఘా నీడలో ఉండేలా పథక రచన చేశాడు. ఆమె ఎక్కడ ఉంటుంది.. ఎక్కడకు వెళుతుంది..ఇంటికి ఎప్పుడు వస్తుంది.. ఇలా అన్ని విషయాలు తెలుసుకునేందుకు కొన్ని నెలల క్రితం ఐశ్యర్యకు బహుమతిగా అందించిన స్కూటీకి జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చినట్టు విచారణలో వెల్లడించినట్టు సమాచారం.
అయితే జీపీఎస్ ట్రాకర్ అమర్చిన విషయం ఇప్పటి వరకు ఐశ్యర్యకు తెలియదని చెప్పినట్టు తెలిసింది. తేజేశ్వర్‌తో ఐశ్వర్యకు నిశ్చితార్థమైన రెండురోజులకే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తిరుమలరావుతో చెప్పడంతో.. బెంగళూరులో ఉంటున్న తన బంధువుల ఇంటికి పంపించాడు. ఈ క్రమంలో కర్నూలులోని నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐశ్వర్య కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని ఆమె బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి.. వారి బంధువులకు అప్పగించారని విచారణలో బహిర్గతమైందని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై గద్వాల పోలీసులు అక్కడి పోలీసుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
నిత్యం సాంకేతిక శోధన..
తిరుమలరావు నిత్యం సాంకేతిక విషయ పరిజ్ఞానంతో ముందు నుంచి ఓ పథకంతో ఉండేవాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు వివిధ అంశాలపై గూగుల్‌లో సెర్చ్ చేసి వ్యూహాత్మకంగా సాంకేతిక అంశాలనే అమలు చేశాడు. అయితే తేజేశ్వర్ మృతదేహంపై దాదాపు 9 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో ఉంది. హత్య చేసిన నిందితుల రక్త నమూనాలు, తేజేశ్వర్ మృతదేహం నుంచి తీసిన ఎముకల నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించినట్టు సమాచారం.
కీలక విషయాలపై ఆరా తీస్తున్నాం..
తేజేశ్వర్ హత్య కేసులో కీలక విషయాలపై ఆరా తీస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానంతో తిరుమలరావు కేసు నుంచి బయటపడేందుకు నిత్యం గూగుల్ సెర్చ్ చేస్తుండేవాడు. వ్యతిరేకంగా ఉన్న వారి కదలికలను గుర్తించేందుకు జీపీఎస్ ట్రాకర్‌తో తెలుసుకునేవాడు. తేజేశ్వర్‌తో ఐశ్వర్య నిశ్చితార్థం తర్వాత కర్నూలు జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు, తదితర విషయాలపై ఆరా తీస్తున్నాం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – శ్రీను, సీఐ, గద్వాల