
చత్తీస్‌గడ్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నరసింహ అలియాస్ సుధాకర్ మృతిచెందారు. ఈరోజు(గురువారం) ఉదయం నుంచి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గ పోలీసులకు మావోయిస్టులకు జరుగుతున్న ఎదురుకాల్పుల్లో సుధాకర్ మృత్యువాత పడ్డారు.
ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం చర్యలు చేపట్టింది. తమతో చర్చలు జరపాలనే మావోయిస్టు పార్టీ ఇదివరకే విజ్ఞప్తి చేసినా అ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హిడ్మాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతిచెందడం మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నారు సుధాకర్. అయితే గత ఆరు నెలల్లో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. సుధాకర్‌పై రూ. కోటి రివార్డు ఉంది. 2004లో ప్రభు త్వంతో జరిగిన చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు.
కాగా, వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో ఆపరేషన్ కగార్ ఒకటి. ఇది గతేడాది నుంచి ఊపందుకోగా, ఈ ఆపరేషన్ అనేక మంది మావోయిస్టుల కీలక నేతలు హతమయ్యారు. దేశ వ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం తన చర్యలను ముమ్మరం చేసింది.
ఇదిలా ఉంచితే, మావోయిస్టులపై కేంద్ర చేపడుతున్న చర్యలకు నిరసనగా జూన్ 10వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది మావోయిస్టు కేంద్ర కమిటీ. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చింది. అదే సమయంలో జూలై 11 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ అమరుల స్మారక సభలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది.
