
ఘనంగా పద్మ పురస్కారాలు–2025 ప్రదానోత్సవం
సాక్షి, న్యూఢిల్లీ: పద్మ పురస్కారాలు–2025 ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. వ్యక్తిగత విభాగంలో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ముగ్గురు పద్మశ్రీలు అందుకున్నారు.
తెలంగాణ నుంచి ప్రజా వ్యవహారాల రంగంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ, ఏపీ నుంచి సాహిత్యం, విద్యా రంగంలో ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ, వాచస్పతి డాక్టర్ వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి తదితరులు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు.
మంద కృష్ణ అవార్డు అందుకుంటున్న సమయంలో ఆయన కుమార్తె కృష్ణవేణి ఉద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జైశంకర్, జి.కిషన్‌రెడ్డి,« బండి సంజయ్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రల్హాద్ జోషి, భూపేంద్ర యాదవ్ తదితరులు హాజరయ్యారు.