‘యూనిఫామ్ తీసి రారా అన్నాడు.. జైల్లో వేసేసరికి ఏడుస్తూ కూర్చున్నాడు!

Man Held For Verbally Abusing Traffic Police Over Car Parking In Mumbai - Sakshi

ముంబై: ఈ మధ్య కాలంలో కొందరు యువకులు ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోతున్నారు. తప్పు తమదైనా మద్యం మత్తులోనో.. అధికారం ఉందనో.. అహంకాంతోనో గానీ దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ముంబైలో మీరా రోడ్డు వద్ద ఓ వ్యక్తి ట్రాఫిక్‌ పోలీసును నానా బూతులు తిట్టాడు. వివరాల్లోకి వెళితే.. మీరా రోడ్డులో ఓ వ్యక్తి తన కారును నోపార్కింగ్‌ స్థలంలో నిలిపాడు. అది గమనించిన ట్రాఫిక్‌ అధికారి తన కిందిస్థాయి సిబ్బందితో కలిసి వచ్చి దానిని తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కారు ఓనర్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు తిట్టాడు. ‘‘ ‘యూనిఫామ్ తీసి రారా.. నీ తాట తీస్తా..’’ అంటూ రెచ్చిపోయాడు.  అంతే కాకుండా అతని వెంట మరో మహిళ కూడా ఉంది.

ఇక వాగ్వాదాన్ని ఓపికగా భరించి.. పోలీసులు ఆ ఘటనను వీడియో తీశారు. ఆ ఇద్దరు వ్యక్తులు కనీసం మాస్క్ కూడా ధరించకపోవడంతో కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించినట్లయ్యింది. దీంతో వీరిపై పోలీసులు రెండు రకాలుగా కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి.. తమదైన స్టైల్‌లో సమాధానమిచ్చారు. అప్పటి వరకు ఎగిరిపడిన ఆ వ్యక్తి.. ఓ మూలన కూర్చుని ఏడ్చాడు. పోలీసులు ఈ సన్నివేశాన్ని కూడా వీడియో చిత్రీకరించి. రెండింటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ ఘటనపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఆ విషయం ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది.’’ అంటూ కామెంట్‌ చేశాడు. మరో నెటిజన్‌ ‘‘బాబుకు బ్యాండ్‌ బాజా మోగినట్లుంది. పాపం అలిసిపోయాడు.’’ అం​టూ రాసుకొచ్చారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top