
పట్నా: దేశంలో దొంగ బాబాల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవలి కాలంలో పోలీసులకు పట్టుబడుతున్న నకిలీ బాబాల గణాంకాలే దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా మరో దొంగబాబా పోలీసులకు చిక్కాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇమాముద్దీన్ అన్సారీ(55) బెంగాలీ బాబా అలియాస్ బాలక్‌నాథ్ పేరుతో చలామణీ అవుతున్నాడు. ఇప్పుడు ఈ దొంగబాబా ఏకంగా మూడు ఆధార్ కార్డులు, పాన్ కార్డుతో పోలీసులకు చిక్కాడు.
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలోని థానా భవన్ పరిధిలోని మంతి హసన్‌పూర్ గ్రామంలోగల శని మందిర్‌లో బెంగాలీ బాబా తిష్ట వేశాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అతని అసలు గుర్తింపు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం అతనిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ నేపధ్యంలో అన్సారీ నుండి పోలీసులు మూడు ఆధార్ కార్డులు, ఒక పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆధార్ కార్డులో బంగాలీ నాథ్ పేరు, సహరాన్‌పూర్‌లోని ఒక ఆలయానికి సంబంధించిన చిరునామా ఉంది. మిగిలిన రెండు ఆధార్ కార్డులు, పాన్ కార్డులలో అతని అసలు పేరు ఇమాముద్దీన్ అన్సారీ , పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్ జిల్లాలోని చిరునామా ఉన్నాయి.
ఎస్పీ రాంసేవక్ గౌతమ్ మాట్లాడుతూ, నకిలీ పత్రాలు కలిగివుండటం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడమనే ఆరోపణలతో నిందితునిపై కేసు నమోదు చేశామన్నారు. అతనిని కైరానా కోర్టు ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారని తెలిపారు. అన్సారీకి సంబంధించిన వివరాలను సేకరించేందుకు యూపీ పోలీసులు పశ్చిమ బెంగాల్‌కు ఒక బృందాన్ని పంపారు. ఈ ఉదంతంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ సంఘటన స్థానిక హిందూ సంస్థలలో ఆగ్రహాన్ని కలిగించింది. ఇలాంటివారిపై పోలీసులు కఠినమైన పోలీసు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.