సందేశ్‌ఖాలీ ర్యాలీలో 'మమతా బెనర్జీ' ఘాటు వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

సందేశ్‌ఖాలీ ర్యాలీలో 'మమతా బెనర్జీ' ఘాటు వ్యాఖ్యలు

Published Thu, Mar 7 2024 6:55 PM

Mamata Banerjee Marches With Sandeshkhali Womens - Sakshi

రగులుతున్న సందేశ్‌ఖాలీ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన తర్వాత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' ఈ రోజు కోల్‌కతాలో మహిళలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సందేశ్‌ఖాలీ ద్వీపానికి చెందిన కొందరు మహిళలు కూడా ర్యాలీలో పాల్గొన్నారు.

మహిలాడర్ అధికార్, అమదర్ అంగీకార్ (మహిళల హక్కులు, మా నిబద్ధత) అనే అంశంతో ర్యాలీ సాగింది. దీనికి సంబంధించిన ఓకే వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో మమతా బెనర్జీ ముందు నడుస్తుంటే.. ప్రముఖ మహిళా తృణమూల్ నాయకులలైన సుస్మితా దేవ్, శశి పంజా, కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ & పాత్రికేయురాలు సాగరిక ఘోష్ వెనుక నడిచారు.

ఈ ర్యాలీలో బీజేపీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీను కూడా మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్‌లో మహిళలను హింసిస్తున్నట్లు బీజేపీ నేతలు ఆరోపించడాన్ని ఖండించారు. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు, హత్రాస్‌లో మహిళపై అత్యాచారం చేసి, ఆమె మృతదేహాన్ని బలవంతంగా దహనం చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని బీజేపీని ఉద్దేశించి అన్నారు. బెంగాల్‌లోనే మహిళలు అత్యంత సురక్షితమని, దీనిని తాను నిరూపించగలనని సవాల్‌ చేశారు.

కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ బీజేపీలో చేరడంపై కూడా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఒక బీజేపీ బాబు గద్దె మీద కూర్చున్నాడు, అతను ఇప్పుడు బీజేపీలో చేరాడు, అలాంటి వారి నుంచి మీరు న్యాయం ఎలా ఆశించగలరని అన్నారు.

ప్రతి ఏడాది మమతా బెనర్జీ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల మార్చ్‌కు నాయకత్వం వహిస్తారు. అయితే ఈ సారి అంతకంటే ముందే ర్యాలీ నిర్వహించారు. 

మహిళా ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్‌కు కీలకమైన మద్దతు. పార్టీ అధికారంలో కొనసాగిన 13 సంవత్సరాలుగా.. కన్యాశ్రీ, రూపశ్రీ, లక్ష్మీర్ భండార్ వంటి పథకాల ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం తప్పకుండా దోహదపడుతుందని అన్నారు.

Advertisement
 
Advertisement