ఉచిత ప్రయాణానికి చెల్లు.. 1 నుంచి బెస్ట్‌ బస్సుల్లో పోలీసులకూ టికెట్‌ 

Maharashtra: No Free BEST Rides For Mumbai Cops Anymore - Sakshi

సాక్షి, ముంబై: బెస్ట్‌ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన ముంబై పోలీసులు జూన్‌ 1 నుంచి టికెట్‌ కొనుగోలు చేయాల్సిందే. ఈ మేరకు కానిస్టేబుళ్లకు, పోలీసు అధికారులకు ఉచిత ప్రయాణం రద్దు చేస్తున్నట్లు పోలీసు శాఖ బెస్ట్‌ సంస్థకు సోమవారం లేఖ రాసింది. పోలీసులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినందుకు పోలీసు శాఖ బెస్ట్‌కు అందజేసే నిధులను కూడా జూన్‌ నుంచి నిలిపివేస్తున్నట్లు లేఖలో స్పష్టం చేసింది. దీంతో జూన్‌ ఒకటో తేదీ నుంచి పోలీసులు బెస్ట్‌ బస్సుల్లో రాకపోకలు సాగించాలంటే సొంత డబ్బులతో టికెటు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పోలీసు శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో కానిస్టేబుళ్లు, సిపాయిలు, అధికారుల్లో అసంతృప్తి నెలకొంది. 

ట్రావెలింగ్‌ అలవెన్సూ లేదు..  
ముంబై పోలీసు శాఖ బెస్ట్‌ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు పోలీసులకు అవకాశం కల్పించింది. విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి కార్యాలయానికి లేదా పోలీసు స్టేషన్‌కు రావడానికి, విధి నిర్వహణలో భాగంగా పోలీసులు వివిధ పనుల నిమిత్తం, కేసు దర్యాప్తు పనుల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. అందుకు పోలీసు శాఖ బెస్ట్‌ సంస్థకు నెలకు కొంత డబ్బు చెల్లింస్తుంది. జూన్‌ 1 నుంచి దీన్ని నిలిపివేస్తున్నట్లు కమిషనర్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇదిలాఉండగా రోజువారి పనుల కోసం పోలీసులకు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అంతేగాకుండా కొందరు పోలీసు అధికారులు సొంత వాహనాలను వినియోగిస్తుంటారు. కాని కానిస్టేబుళ్లు, సిపా యిలు, ఇతర కిందిస్థాయి తరగతి సిబ్బంది బెస్ట్‌ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు.
చదవండి: సీనియర్‌ సిటిజన్ల ముక్కుపిండి రూ.1500 కోట్లు వసూలు

కమిషనర్‌ కార్యాలయ వర్గాలు తీసుకున్న నిర్ణయంతో కిందిస్థాయి ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముంబై పోలీసు కమిషనర్‌ సంజయ్‌ పాండే ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో పోలీసులతో సంప్రదింపులు జరిపారు. ఇది ముంబై పోలీసులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నెల జీతంలో ప్రయాణ భత్యం చెల్లించాలని కొందరు పోలీసులు పాండేకు ప్రతిపాదించారు. కానీ ఒకరి ఇచ్చి మరొకరికి ఇవ్వకుంటే విభేదాలు పొడచూపుతాయని, దీంతో ఎవరికి భత్యం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు పాండే చెప్పారు. అయితే కానిస్టేబుళ్లకు, కిందిస్థాయి ఉద్యోగులకు వేతనంలో భత్యం చెల్లించే విషయంపై త్వరలో ఆలోచిస్తామన్నారు. కానీ, ఎంత మేర భత్యం, ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది స్పష్టం చేయలేదు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top