ఒంటికాలిపై.. 43 రోజుల్లో 3,800 కి.మీ.

Madhya Pradesh Tanya Dhag CycleD 3800 Kilometers In 43 Days - Sakshi

భోపాల్‌ : అవయవాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఒక చోట నుంచి మరోచోటకి ప్రయాణం చేయాలంటే చిరాకు పడుతుంటాం. అటువంటిది ఒంటి కాలుతో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది మధ్యప్రదేశ్‌కు చెందిన తాన్య దగా. బీఎస్‌ఎఫ్‌ సహకారంతో నడిచే ఆదిత్యా మెహతా ఫౌండేషన్‌.. దేశవ్యాప్తంగా శారీరకంగా వికలాంగులైన విద్యార్థులకు పారా స్పోర్ట్స్‌పై అవగాహన కల్పించి, విరాళాలు సేకరిస్తుంది. ఇందులో భాగంగా ఏటా ‘ఇన్ఫినిటీ రైడ్‌’ను నిర్వహిస్తోంది. అయితే ‘ఇన్ఫినిటీ రైడ్‌ కె2కే– 2020’లో తొమ్మిది సభ్యుల బృందంలో ఏకైక ఫిమేల్‌ పారసైక్లిస్ట్‌గా పాల్గొన్న తాన్య.. 43 రోజుల్లో 3,800 కిలోమీటర్ల (కశ్మీర్‌ టు కన్యాకుమారి) సైకిల్‌ యాత్ర పూర్తి చేసింది. 3,800 కిలోమీటర్లు ప్రయాణించి దేశంలోనే ఏకైక ఫిమేల్‌ పారా సైక్లిస్ట్‌గా తాన్య గుర్తింపు తెచ్చుకుంది. 

‘‘అది 2018. నేను డెహ్రాడూన్‌ లో ఎంబీఏ చదువుతున్నాను. ఒకరోజు విధి నాపై కన్నెర్ర చేయడంతో కారు ప్రమాదంలో నా కుడికాలిని కోల్పోయాను. దాంతో ఆరునెలలపాటు బెడ్‌మీద నుంచి కదలలేని పరిస్థితి. అప్పుడు జీవితం అంతా అయిపోయిందనిపించింది. ఆ సమయంలో నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాలో ధైర్యాన్ని నూరిపోసారు. శరీరంలో ఓ భాగం కోల్పోయినంత మాత్రాన మన జీవితం అక్కడితో ఆగిపోదని, మన లక్ష్యం కోసం శ్రమించాలని నాన్న చెప్పిన మాటలే నాకు మరో జీవితాన్నిచ్చాయని తాన్య చెప్పుకొచ్చింది. ఆరు నెలల తర్వాత శారీరకంగాను మానసికంగా దృఢంగా తయారై పారాస్పోర్ట్స్‌ను ప్రోత్సహించే ఫౌండేషన్‌ లో చేరాను’’ అన్నది. 

‘‘ఈ క్రమంలోనే 2020 నవంబర్‌ 19న కశ్మీర్‌ టు కన్యాకుమారి యాత్రకు మా టీమ్‌తో బయలు దేరాము. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో విధి మరోసారి నన్ను వెక్కిరించింది. డిసెంబర్‌ 18న హైదరాబాద్‌లో ఉండగా.. నాన్న చనిపోయాడనే వార్త నన్ను ఒక్కసారిగా కలిచివేసింది. మరోసారి జీవితం అంధకారమైనట్లు అనిపించింది. ఆ బాధతోనే మధ్యప్రదేశ్‌ వెళ్లి నాన్నను కడసారి చూసి వచ్చి.. మళ్లీ మా బృందంతో కలిసి యాత్ర కొనసాగించాను. నన్ను ఎంతగానో ప్రోత్సహించి, కుంగిపోకుండా కొత్త జీవితాన్ని పరిచయం చేసిన నాన్న చివరి కోరిక ఈ యాత్రను పూర్తి చేయడం. అందుకే అంత బాధలోనూ నాన్న స్ఫూర్తితో లక్ష్యాన్ని పూర్తి చేసి నాన్న కోరికను తీర్చానని తాన్య గర్వంగా చెప్పింది’’.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top