అనంత్‌నాగ్‌–రాజౌరీలో... అంతుపట్టని ఓటరు నాడి | Sakshi
Sakshi News home page

అనంత్‌నాగ్‌–రాజౌరీలో... అంతుపట్టని ఓటరు నాడి

Published Tue, May 21 2024 4:08 AM

Lok Sabha Election 2024: Anantnag-Rajouri Lok Sabha Election Be Deferred

పీడీపీ, ఎన్‌సీ హోరాహోరీ 

సవాలు చేస్తున్న చిన్న పారీ్టలు 

తొలిసారి బరిలో కశ్మీరేతరుడు 

పోటీలో లేకున్నా బీజేపీ ప్రచారం 

జమ్మూ కశీ్మర్‌లో అనంత్‌నాగ్‌–రాజౌరీ స్థానంలో పోటీ ఈసారి ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పోలింగ్‌ మే 7న మూడో విడతలో జరగాల్సింది. బీజేపీ, ఇతర పారీ్టల విజ్ఞప్తి మేరకు ఆరో విడతలో భాగంగా మే 25కు కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది... 

2022 పునర్విభజనలో అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానం కాస్తా అనంత్‌నాగ్‌–రాజౌరీగా మారింది. విపక్ష ఇండియా కూటమి భాగస్వాములైన నేషనల్‌ కాన్ఫరెన్స్, పీడీపీ కశీ్మర్‌ లోయలో మాత్రం పరస్పరం పోటీ పడుతున్నాయి. లోయలోని 3 లోక్‌సభ స్థానాలూ 2014లో పీడీపీకే దక్కాయి. 2019లో వాటన్నింటినీ ఎన్‌సీ కైవసం చేసుకుంది.

 సిట్టింగ్‌ ఎంపీ హస్నాయిన్‌ మసూదీ కేవలం 6,676 ఓట్లతో గట్టెక్కారు. ఎన్‌సీ ఈసారి వ్యూహాత్మకంగా గుజ్జర్‌ బకర్వాల్‌ మత నాయకుడు, పార్టీ సీనియర్‌ నేత మియా అల్తాఫ్‌ను బరిలో దింపింది. ఆయనకు పూంచ్, రాజౌరిలో గట్టి మద్దతుంది. ఇది ఇతర పారీ్టల ఓట్లను చీల్చే అవకాశముంది. మోదీ ప్రభుత్వం ఫిబ్రవరిలో పహాడీ జాతి సమూహాలకు షెడ్యూల్డ్‌ తెగ హోదా ఇచ్చాక సమీకరణాలు మారాయి.

 కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వేరు కుంపటి పెట్టుకున్న గులాం నబీ ఆజాద్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ (డీపీఏపీ) నుంచి మహమ్మద్‌ సలీమ్‌ పారే, అప్నీ పార్టీ నుంచి జాఫర్‌ ఇక్బాల్‌ మన్హాస్‌ బరిలో ఉన్నారు. ఆరి్టకల్‌ 370 రద్దు నేపథ్యంలో బల్‌దేవ్‌ కుమార్‌ రూపంలో జమ్మూకశీ్మర్‌లో తొలిసారిగా ఓ స్థానికేతరుడు పోటీ చేస్తుండటం విశేషం. ఆయన స్వస్థలం పంజాబ్‌. 

లెక్కలు మార్చేసిన డీలిమిటేషన్‌! 
2022కు ముందు జమ్మూలో రెండు (జమ్మూ, ఉధంపూర్‌), కశ్మీర్‌లో మూడు (శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్‌), లద్దాఖ్‌లో ఒక లోక్‌సభ స్థానముండేవి. డీలిమిటేషన్‌ తర్వాత జమ్మూలో రెండు స్థానాలు కొనసాగినా అక్కడి పూంచ్, రాజౌరి జిల్లాల్లో చాలా భాగాన్ని కశీ్మర్‌లోని అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానంతో కలిసి అనంత్‌నాగ్‌–రాజౌరీగా చేశారు.

 ఈ లోక్‌సభ స్థానం పరిధిలో 18 అసెంబ్లీ సీట్లున్నాయి. మొత్తం 18.3 లక్షల ఓటర్లున్నారు. 10.94 లక్షల మంది కశీ్మర్‌ ప్రాంతంలో, 7.35 లక్షల మంది జమ్మూలో ఉన్నారు. మెజారిటీ కశీ్మరీలు ముస్లింలు. జమ్మూలో 3 లక్షల మేర గుర్జర్లు, బేకర్వాల్‌ సామాజిక వర్గం ఉంది. మిగతా జనాభా పహాడీలు (హిందువులు, సిక్కులు ఇతరత్రా). 

వారిని ఎస్టీ జాబితాలోకి చేర్చడం వంటి చర్యల ద్వారా బీజేపీ నెమ్మదిగా లోయలో పాగా వేయజూస్తోంది. ఈసారి పోటీ చేయకున్నా వేరే పారీ్టలకు మద్దతిస్తోంది. బీజేపీ నేతలు తీవ్రంగా ప్రచారమూ చేస్తున్నారు. ఎన్‌సీ, కాంగ్రెస్, పీడీపీలపై సభలు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు! ఆ మూడింటికి కాకుండా ఎవరికైనా ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కశీ్మరీ పండిట్‌ ఒంటరి పోరు 
కశీ్మరీ పండిట్లు. 1980ల్లో పెచ్చరిల్లిన హింసాకాండకు తాళలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసపోయిన ప్రజలు. ఏళ్ల కొద్దీ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ వర్గానికి చెందిన దిలీప్‌ కుమార్‌ పండిత (54) ఈసారి అనంత్‌రాగ్‌–రాజౌరి నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు! ముఫ్తి, మియా అల్తాఫ్‌ అహ్మద్‌లకు గట్టి సవాల్‌ విసురుతున్నారు. 

పౌర చర్చల ద్వారా పండిట్లు, ముస్లింలతో పాటు కశ్మీరీలందరినీ ఏకం చేస్తానన్నది ఆయన హామీల్లో ప్రధానమైనది. నిజాయితీగా ఆయన చేస్తున్న ప్రయత్నం స్థానికులను ఆకర్షిస్తోంది. ప్రతి గడపకూ వెళ్లి ఓట్లడుగుతున్నారు. స్థానికులతో భేటీ అవుతున్నారు. 

ఐదు వలస శిబిరాల్లో ఉన్న 35,000 మంది పండిట్లను తనకే ఓటేయాలని కోరారు. ‘‘35 ఏళ్లుగా ఇంటికి దూరంగా బతుకుతున్నాం. మాకిప్పటికీ న్యాయం జరగలేదు. కశీ్మరీ పండిట్లకు న్యాయం కోసం, వారు లోయలోకి సురక్షితంగా తిరిగొచ్చే పరిస్థితులను నెలకొల్పడం కోసం పోరాడుతున్నాను’’ అని మీడియాకు తెలిపారు పండిత.

బీజేపీ అడ్డుకుంటోంది: ముఫ్తీ 
తాము ప్రజలను కలవకుండా మోదీ సర్కారు అడ్డుకుంటోందని ముఫ్తీ ఆరోపిస్తున్నారు. ‘‘ఆరి్టకల్‌ 370 రద్దుతో వారు నెలకొల్పామంటున్న శాంతి నిజానికి శ్మశాన వైరాగ్యం. మాకది ఆమోదయోగ్యం కాదు. జమ్మూ కశ్మీర్‌ యంత్రాంగం దన్నుతో దక్షిణ కశీ్మర్‌లో ఎన్‌కౌంటర్లు మొదలయ్యాయి’’ అని మండిపడుతున్నారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement