డ్రోన్లతో చొరబాట్లు! | Lashkar-e-Taiba Utilizes Drones to Infiltrate Terrorists into Punjab | Sakshi
Sakshi News home page

డ్రోన్లతో చొరబాట్లు!

Sep 17 2023 5:17 AM | Updated on Sep 17 2023 5:19 AM

Lashkar-e-Taiba Utilizes Drones to Infiltrate Terrorists into Punjab - Sakshi

న్యూఢిల్లీ:  డ్రోన్లతో ఉగ్రవాదులు ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, డబ్బులు చేరవేయడం గురించి విన్నాం. చొరబాట్లకు కూడా డ్రోన్లను ఉపయోగించుకుంటున్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్‌ చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కొన్ని నెలల క్రితం డ్రోన్‌తో పంజాబ్‌లో ఓ ఉగ్రవాదిని జార విడిచిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ డ్రోన్‌కు 70 కిలోల వరకు బరువును మోసుకెళ్లగల సామర్థ్యం ఉందని తెలియజేశాయి.

పాకిస్తాన్‌ భూభాగంలోని షాకర్‌గఢ్‌లో లష్కతే తోయిబా శిక్షణా కేంద్రంలో ఇలాంటి డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్న వీడియోను నిఘా వర్గాలు సేకరించాయి. డ్రోన్లు మనుషులను సునాయాసంగా మోసుకెళ్లి, నీటిలో భద్రంగా వదిలిపెడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. పంజాబ్‌లో డ్రోన్‌ సాయంతో అక్రమంగా చొరబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించామని అధికారులు చెప్పారు. లష్కరే తోయిబా నాయకులే డబ్బులు ఇచ్చి పంపించినట్లు అతడు అంగీకరించాడని తెలిపారు.

డ్రోన్‌ సాయంతో పంజాబ్‌ వెళ్లి, అక్కడే స్థిరపడి, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాలంటూ లష్కరే తోయిబా నాయకత్వం నుంచి అతడికి ఆదేశాలు అందాయని వెల్లడించారు. పంజాబ్‌లో ఇప్పటికే మకాం వేసిన ముష్కరుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీసుకోవాలంటూ అతడికి సూచనలిచ్చారని పేర్కొన్నారు. లష్కరే తోయిబాపై భారత్‌ గతంలోనే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

  పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి ఆయుధాలను, డ్రగ్స్‌ను పంపించడానికి పాకిస్తాన్‌ ఉగ్రవాద మూకలు డ్రోన్లను వాడుకుంటున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది.  ప్రధానంగా జమ్మూకశీ్మర్, పంజాబ్‌కు ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్‌ వచ్చి పడుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థలతోపాటు ఖలిస్తాన్‌ అనుకూల శక్తుల హస్తం కూడా ఉండొచ్చని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం  
శ్రీనగర్‌:  వాస్తవా«దీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చొరబాటు యత్నాన్ని భారత భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్‌ హథ్లాంగ్‌ ఫార్వర్డ్‌ ఏరియాలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. సైన్యం, కశ్మీర్‌ పోలీసులు, నిఘా ఏజెన్సీలు ఉమ్మడి ఆపరేషన్‌ చేపట్టాయని, చొరబాటు యత్నాన్ని భగ్నం చేశాయన్నారు.

పొరుగు దేశం నుంచి మన భూభాగంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను అడ్డుకొనేందుకు ప్రయతి్నంచగా, కాల్పులు జరిపారని, దాంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయని తెలిపారు. కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు మరణించారని, ఇద్దరి మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నామన్నారు. పాకిస్తాన్‌ వైపు నుంచి కాల్పులు కొనసాగుతున్నాయన్నారు. హతమైన ముగ్గురు ముష్కరుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మరోవైపు, అనంత్‌నాగ్‌ జిల్లాలో ముగ్గురు భారత ఉన్నతాధికారులను బలి తీసుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ శనివారం నాలుగో రోజుకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement