“నేను వెళ్లబోయే మార్గం సులభం కాదని నాకు తెలుసు..” అంటూ కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజకీయ వర్గాలను, విశ్లేషకులను ఆయన మాటల్లో అంతర్యాన్ని వెతుక్కునే పనిలో పడేసింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్‌లో సాయంత్రం 4.05 గంటలకు గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఆయనకు పదవీ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సంకేతాలు అందుతున్నప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే..
ప్రమాణ స్వీకారానికి ముందు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజల నుంచి తనపై ఉంచిన నమ్మకానికి తాను కృతజ్ఞుడినని ఆయన తెలిపారు. అదే సమయంలో “ముందున్న మార్గం సులభం కాదు” అంటూ చేసిన వ్యాఖ్యలు, పాలనలో ఎదురయ్యే సవాళ్లపై ముందస్తు సంకేతంగా భావిస్తున్నారు.
డీకే శివకుమార్ ఎమోషనల్‌గా చేసిన వ్యాఖ్యలు.. ఆయన భవిష్యత్ పాలనా దిశపై హింట్ ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ఆయన “ఒక కొత్త యువ యుగం ప్రారంభమవుతుంది” అని చేసిన వ్యాఖ్యలు.. కొత్త ప్రభుత్వంలో యువత, అభివృద్ధి, సమగ్ర పాలనకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాలను కలుపుకుని పాలన సాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
#WATCH | Delhi: Karnataka CM-designate DK Shivakumar says, "The faith and the confidence the people of this country have shown me, I am very much obliged, and I have to do a lot of hard work and deliver. I know roads will not be so easy. It will be difficult times, but still I… pic.twitter.com/0LutwvdX9l
— ANI (@ANI) June 3, 2026
ఈ పరిణామాల నేపథ్యంలో డీకే శివకుమార్ చేసిన “యువ యుగం” వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు మాజీ సీఎం సిద్ధరామయ్య రాజకీయంగా పూర్తిగా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించకపోవడం, తన వర్గానికి ప్రాధాన్యం కొనసాగించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకోసం సీనియర్ల మద్దతును ఆయన ప్రయోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డీకే యువత, అభివృద్ధి, సమగ్ర పాలనపై ఇచ్చిన సంకేతాలు భవిష్యత్ పాలనా శైలిపై స్పష్టమైన సూచనగా భావిస్తున్నారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్‌లో కొత్త సమీకరణాలు, అంతర్గత సమతుల్యతపై చర్చలు మరింత వేగం అందుకున్నాయి.
డీకే శివకుమార్ అలియాస్ డీకే.. 64 ఏళ్ల వోక్కలిగా నేతగా, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్‌లో జరిగే ఈ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో కార్యక్రమాన్ని కొంత నియంత్రిత స్థాయిలో నిర్వహిస్తున్నారు.


