
మీరట్: ఉత్తరాదిన జూలై 11న ప్రారంభమయ్యే వార్షిక కన్వర్ యాత్ర నేపధ్యంలో యూపీలోని మీరట్ జిల్లా యంత్రాంగం పలు నిబంధనలను విధించింది. కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఫుడ్ కోర్టులు తాము విక్రయించబోయే ఆహార పదార్థాల జాబితా, వాటి ధరలతో సహా ఇతర కీలక సమాచారాన్ని బహిరంగంగా ప్రదర్శించాలని మీరట్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. గత ఏడాది ఇటువంటి నిబంధనల నేపధ్యంలోనే ప్రభుత్వానికి వ్యాపారులకు మధ్య వివాదం తలెత్తింది.
మీరట్ డివిజనల్ కమిషనర్ హృషికేష్ భాస్కర్ యశోద్ మీడియాతో మాట్లాడుతూ కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఆహారశాలల వెలుపల ఆహార పదార్థాల ధరల జాబితాను ప్రదర్శించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు. దీని వలన భక్తుల నుంచి అధిక ఛార్జీలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. అలాగే తమకు కావలసిన ఆహారాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఆహారశాలల యజమానులు తమ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, ఆహార భద్రత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను బహిరంగంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని హృషికేష్ భాస్కర్ యశోద్ తెలిపారు. ఆహార భద్రతా చట్టం, 2006లోని సెక్షన్ 55 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా లేని వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.
#WATCH | Meerut, UP | Commissioner Meerut Division, Dr Hrishikesh Bhaskar Yashod says, "The district administration is ensuring that a list of food items and their prices is displayed outside all the food joints along the Kanwar yatra route. The food safety department will ensure… pic.twitter.com/9wrpzdS7rp
— ANI (@ANI) July 2, 2025
కన్వర్ యాత్రను శివ భక్తులు చేపడుతుంటారు. శ్రావణ మాసంలో గంగా నది నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి. శివునికి అభిషేకం చేస్తుంటారు. ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కాగా 2024లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార బండ్లు నిర్వహించేవారు తమ పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. అయితే ఇది వివాదాస్పందంగా మారి, సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వ చర్యను నిలిపివేసింది. ఆహారశాలల యజమానులు తాము అందించే ఆహార పదార్థాలను సూచిస్తే సరిపోతుందని, యజమానుల పేర్లు, వారి గుర్తింపులను ప్రదర్శించాలంటూ ఒత్తిడి చేయవద్దని పేర్కొంది.
ఇది కూడా చదవండి: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. అంతటా ‘హర్ హర్ మహదేవ్’ నినాదాలు