
సాక్షి, ఢిల్లీ: దేశరాజధానిలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేగింది. సోమవారం పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్స్, మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. తొలుత..
ద్వారకా ఏరియాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు సోమవారం ఉదయం బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీస్, ఫైర్ సిబ్బందితోపాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ క్యాంపస్‌కు చేరుకుని అక్కడున్నవాళ్లను ఖాళీ చేయించి తనిఖీ చేపట్టారు. ఆ వెంటనే మరికొన్ని స్కూళ్లకు ఇదే తరహాలో ఫోన్లు, మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ పరిసరాల్లోని పాఠశాలలకు ఇలా బాంబు బెదిరింపులు ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా వస్తున్నాయి. ఒక్కవారంలోనే పాతికకు పైగా ఇలాంటి బాంబు బూచీ బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో.. ఉత్తుత్తి బెదిరింపులను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈమెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయ IP అడ్రస్‌లు, వర్చువల్ ప్రాక్సీలు వాడుతున్నట్లు గుర్తించారు. తాజాగా.. ఓ స్కూల్‌కు బాంబు ఉందని, పిల్లలు చనిపోతారని కాల్ చేసిన వ్యక్తిని.. 12 ఏళ్ల బాలుడిగా పోలీసులు గుర్తించడం తెలిసిందే.
స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసులు, పబ్లిక్ ప్లేసులు, ఆఖరికి విమానాల్లోనూ బాంబు ఉందంటూ ఫోన్, మెసేజ్, సోషల్ మీడియా ద్వారా వచ్చినా, కఠిన ప్రోటోకాల్ ప్రకారం విచారణ జరుగుతుంది. ఇలాంటి నేరాలకు పాల్పడినవారిపై జైలు శిక్ష, ఆర్థిక జరిమానా విధిస్తారు. విమానాలకు బాంబు బెదిరింపులు చేస్తే శిక్షతోపాటు ప్రయాణాలు చేయకుండా బ్లాక్‌లిస్ట్లో చేర్చే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో.. BNS (భారతీయ న్యాయ సంహిత) ప్రకారం ఉగ్రవాద చర్యగా పరిగణించి జీవిత ఖైదు తరహా కఠిన శిక్షా పడొచ్చు.