
కోజికోడ్: కేరళలోని కోజికోడ్‌లో బ్రెయిన్ ఈటింగ్ అమీబా(అమీబిక్ ఎన్సెఫాలిటిస్) కలకలం సృష్టిస్తోంది. ఈ అరుదైన వ్యాధికి గురైన తొమ్మిదేళ్ల బాలిక ప్రాణాలొదిలింది. నేగ్లేరియా ఫౌలేరి జిల్లాలో ఇదే తరహాలో మరో మూడు కేసులను ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపధ్యంలో ప్రజారోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
కలుషిత నీటిలో కనిపించే ఈ అరుదైన అమీబా మానవ మెదడు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందని నిపుణులు తెలిపారు. అధికారులు పేర్కొన్న వివరాల ప్రకారం వారం రోజుల క్రితం ఒక బాలికకు తీవ్ర జ్వరం రావడంతో, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో బాధిత బాలికను కోజికోడ్ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. ఈ ఏడాది జిల్లాలో ఈ తరహా కేసులలో ఇది నాల్గవది.
అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అంటే..
వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అనేది మెదడుకు సోకే అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. దీనిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) ,గ్రాన్యులోమాటస్ అమీబిక్ ఎన్సెఫాలిటిస్ (GAE). ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌కు ప్రధాన కారణం నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా. ఈ అమీబా మెదడు కణజాలాన్ని నాశనం చేసి, మెదడు వాపుకు దారితీస్తుంది. చాలా సందర్భాల్లో ఇది మరణానికి కారణమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా అరుదుగా కనిపించినప్పటికీ, కౌమార దశలోనివారికి సోకుతుండటాన్ని నిపుణులు గమనించారు. కలుషితమైన నీటిలో మునిగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నదులు, చెరువులు, కాలువలలో ఈతకు దిగేవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలున్నాయని నిపుణులు తెలిపారు.
లక్షణాలు- నివారణ
వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి సోకినప్పుడు ప్రారంభంలో సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు ఇబ్బంది పెడతాయి. వ్యాధి తీవ్రమైన తరుణంలో మెడ బిగుసుకుపోవడం, మూర్ఛ, కోమా తదితర సమస్యలు సమస్యలు తలెత్తవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు వేగంగా అభివృద్ధి చెందుతూ 18 రోజుల్లో ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ వ్యాధి నివారణకు
వైద్య నిపుణులు పలు సూచనలు చేశారు. పిల్లలను చెరువులు లేదా నిలిచిన నీటిలో స్నానం చేయనివ్వకూడదని సూచించారు. స్విమ్మింగ్ పూల్స్, వాటర్ థీమ్ పార్క్‌లలో నీటిని క్లోరినేట్ చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. కలుషిత నీటికి దూరంగా ఉండటం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి నుండి రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.