
న్యూఢిల్లీ: కేరళలో ‘మెదడును తినే అమీబా’ కేసులు కలకలం రేపుతున్నాయి. అధిక మరణాల రేటు కలిగిన మెదడు ఇన్ఫెక్షన్ అయిన ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పామ్) కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో కేరళ ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి వల్ల వస్తుంది. దీనిని సాధారణ బాషలో ‘మెదడును తినే అమీబా’ అని పిలుస్తారు. ఈ ఏడాది కేరళలో ఈ తరహాలో 61 పామ్ కేసులు నమోదయ్యాయి. 19 మరణాలు సంభవించాయి. వీటిలో పలు మరణాలు గత కొన్ని వారాలలోనే నమోదయ్యాయి.
కేరళ ప్రస్తుతం తీవ్రమైన ప్రజారోగ్య సవాలుతో పోరాడుతోందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. గతంలో కోజికోడ్, మలప్పురం తదితర జిల్లాల్లోని క్లస్టర్‌లతో ముడిపడి ఉన్న ఈ ఇన్ఫెక్షన్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు. బాధితుల జాబితాలో మూడు నెలల శిశువు నుండి 91 ఏళ్ల వయస్సు వారి వరకు ఉన్నారని తెలిపారు. కేరళ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ‘పామ్’ అనేది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పలు సందర్భాలలో ఇది తీవ్రమైన మెదడు వాపు, మరణానికి దారి తీస్తుంది. ఇది సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, టీనేజర్లు, యువకులకు సోకుతుంది.
మెదడును తినే అమీబా అనేది నిలిచిపోయిన నీరులో కనిపిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ అమీబాతో కలుషితమైన నీటి వనరులలో ఈత కొట్టడం, డైవింగ్ చేయడం లేదా స్నానం చేసేవారికి ఈ అమిబీ సోకే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. పామ్ కేసులలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని నిర్ధారించడం కష్టమని నిపుణుల చెబుతున్నారు.
అయితే దీని లక్షణాలు బాక్టీరియల్ మెనింజైటిస్ లాంటివి.. అంటే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు. ‘పామ్’ సోకినప్పుడు ఈ లక్షణాలు ఒకటి నుండి తొమ్మిది రోజుల మధ్య కనిపించే అవకాశాలున్నాయి. కేరళలో 2016లో తొలి ‘పామ్’ కేసు నమోదయ్యింది. గత ఏడాది నుంచి ఈ కేసులలో పెరుగుదల కనిపించింది . కొత్త ఇన్ఫెక్షన్లను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు చెరువులు, సరస్సులు వంటి శుద్ధి చేయని లేదా నిలిచిపోయిన నీటి వనరులలో ఈత కొట్టటం లాంటి పనులు చేయవద్దని కేరళ ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది.