
న్యూఢిల్లీ: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సోమవారం తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన అద్దె బంగ్లాకు ఇప్పటికే కొంత సామాను కూడా పంపించామన్నారు. మిగతాది కూడా ప్యాకింగ్ పూర్తి చేసి స్టోర్ రూంలో ఉంచామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ కృష్ణ మీనన్ మార్గ్‌లోని ఐదో నంబర్ బంగ్లాలో చంద్రచూడ్ దంపతులు దివ్యాంగులైన ఇద్దరు కుమార్తెలతో ఉంటున్నారు. అయితే, అనుమతించిన సమయానికి మించి ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాయడం కలకలం రేపింది.
ఈ అంశం వివాదాస్పదం కావడం తనకెంతో విచారం కలిగించిందన్నారు. ‘నా కుమార్తెలు ప్రియాంక, మహిలు నెమాలిన్ మయోపతి అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఇంట్లో కూడా వారిని అత్యంత పరిశుభ్రతతో కూడిన వాతావరణంలో ఉంచాల్సి ఉంది. వారికోసం ప్రత్యేకంగా నర్సును ఏర్పాటు చేశాం. వారిని వీల్‌చైర్‌లో తిప్పేందుకు అనువుగా ఉండే ఇల్లు ఎంతో అవసరం. పెయిన్, స్పీచ్ థెరపీతోపాటు వారికి నిత్యం చెస్ట్, రెస్పిరేటరీ, న్యూరలాజికల్ థెరపీనీ చేయించాల్సి ఉంటుంది. కొత్త ఇల్లు సిద్ధమైందని చెప్పిన వెంటనే ఖాళీ చేస్తాం..అందుకు రెండు రోజులు, రెండు వారాలు కూడా పట్టొచ్చు..’అని చంద్రచూడ్ చెప్పారు.