
పలు కేటగిరీల్లో 267 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తింపు
భర్తీకి ప్రతిపాదనలు రూపొందిస్తున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటైన శిశు గృహాలు, బాలసదనాలు, జిల్లా స్థాయి శిశు సంరక్షణ యూనిట్లలో పలు కేటగిరీల్లో 267 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. నవజాత శిశువు మొదలు ఆరేళ్లలోపు ఉన్న చిన్నారుల సంరక్షణలో ఈ గృహాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17 శిశు గృహాలు, బాలసదనాలున్నాయి. వీటితో పాటు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ పరిధిలో శిశు విహార్ ఉంది. మంజూరైన పోస్టుల్లో దాదాపు 60 శాతానికి పైబడి ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.
కీలక పోస్టులు ఖాళీ..
శిశు గృహాలు, బాల సదనాల్లోని చిన్నారుల ఆలనా, పాలన చూసుకోవడంలో ఆయాలు కీలక భూమిక పోషిస్తుండగా.. వారికి వైద్య సేవలందించడంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాత్ర కూడా ప్రధానంగా ఉంటుంది. ఈ గృహాల్లో మొత్తం 32 మంది వైద్యులు పనిచేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 8 మంది మాత్రమే కొనసాగుతున్నారు. నర్సుల కేటగిరీలో 70 శాతం మేర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇవికాకుండా సూపరింటెండెంట్, మ్యాట్రిన్, నైట్ వాచ్‌మెన్ పోస్టులు కూడా పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా స్థాయి శిశు సంరక్షణ కేంద్రాల్లో చాలా కేటగిరీల్లో వేకెన్సీ ఉంది. శిశు గృహాల్లో మొత్తంగా 267 పోస్టులు ఖాళీగా ఉండగా జిల్లా స్థాయి శిశు సంరక్షణ కేంద్రాల్లో 67 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు గణాంకాలు వెల్లడించారు. వీటి భర్తీకి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ అనుమతి కోసం పంపాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.