
న్యూఢిల్లీ: బ్రిటన్ రాజు చార్లెస్–3 తనకు 75వ పుట్టిన రోజు సందర్భంగా కానుకగా పంపిన కదంబ మొక్కను శుక్రవారం ప్రధాని మోదీ అధికార నివాస ప్రాంగణంలో నాటారు. ‘తల్లి పేరుతో ఒక చెట్టు’ అన్న ప్రధాని మోదీ నినాదం ప్రేరణతోనే రాజు చార్లెస్ ఈ మొక్కను పంపారని ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయం తెలిపింది. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలంటూ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధాని మోదీ, చార్లెస్–3 కట్టుబడి ఉన్నారనేందుకు ఈ కానుకే ఒక ఉదాహరణ అని తెలిపింది.
ఈ నెల 17వ తేదీన ప్రధాని మోదీ తన నివాస ప్రాంగణంలో మొక్కను నాటుతున్నప్పటి వీడియోను బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయం శుక్రవారం ఆన్‌లైన్‌లో షేర్ చేసింది. ఇద్దరు నేతల మైత్రి, పర్యావరణ పరిరక్షణపై ఇద్దరి నిబద్ధతకు ఇది ప్రతీకని తెలిపింది. జూలైలో బ్రిటన్‌లో ప్రధాని మోదీ పర్యటన సమయంలో రాజు చార్లెస్–3 సొనొమా మొక్కను బహుమతిగా అందజేశారు. ‘కామన్వెల్త్, యూకే–భారత్ ఉమ్మడి భాగస్వామ్య విజన్–2035కు వాతావరణ, పరిశుభ్రమైన ఇంధన రంగాలే కీలకం’ అని బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది.