
న్యూఢిల్లీ: ఒక్క ఏడాది వెనక్కి వెళితే.. డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు సీజేఐ స్థానంలో కచ్చితమైన తీర్పులతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. ఇప్పుడు అదే చంద్రచూడ్ మాజీ సీజేఐ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అధికారిక నివాసం విషయమై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ రాయడంతో ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చారు.
జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ అనంతరం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండటాన్ని సర్వోన్నత న్యాయస్థానం లేఖలో ప్రస్తావించింది. అయితే దీనిపై ఇప్పటికే స్పందించిన చంద్రచూడ్.. మరోసారి తాను ఆ నివాసాన్ని ఇప్పటివరకూ ఎందుకు ఖాళీ చేయాలేకపోయాననే అంశంపై ఎన్డీటీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో కాస్త వివరంగా షేర్ చేసుకున్నారు.
పిల్లల్ని ప్రత్యే పరిస్థితుల్లో పెంచుతున్నాం..
‘మా పిల్లలు ప్రియాంక, మహిలను ప్రత్యేక పరిస్థితుల్లో పెంచాల్సి వస్తుంది. 24 గంటలు వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. నేను, నా భార్య కల్పనా దాస్ ఇద్దరం కలిసి పిల్లల ఆలనా పాలన చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ప్రత్యేకమైన డిజార్డర్‌తో బాదపడుతున్నారు. పిల్లల ఇద్దరికీ అరుదైన డిజార్డర్ కలిగి ఉన్నారు. నెమలైన్ మయోపతి(శరీరంలోని కండరాల సమస్యతో బాధపడుతున్నారు). దీనిపై భారత్‌తో పాటు విదేశాల్లో పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికి ట్రీట్‌మెంట్ ఏమీ కూడా ప్రపంచంలో లేదు. ఇది మోటార్ స్కిల్స్ డిజార్డర్. దీనికి డెవలప్‌మెంటల్ కో ఆర్డినేషన్ డిజార్డర్(డీసీడీ) లేదా డైస్ప్రాక్సియా అని కూడా పిలుస్తారు.
అందుకే ఖాళీ చేయలేకపోతున్నాం
పిల్లలకు ఈ డిజార్డర్ నయం చేయడానికి ఎంతోమంది స్పెషలిస్టులతో సంప్రదిస్తూనే ఉంటాం. వారికి మంచి ప్రపంచాన్ని ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. వారిని వారు పనులు చేసుకునేలా, వారి కాళ్ల మీద వారు నిలబడలా చేయడమే మా ముందున్న కర్తవ్యం. ప్రపంచం వారి శ్రేయస్సు కోసం తిరుగుతోంది’ అని చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలొనే తాము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇచ్చిన నివాసాన్ని ఖాళీ చేయలేకపోయామన్నారు
ప్రస్తుతం ప్రభుత్వం తమకు తాత్కాలికంగా అద్దెకు ఇచ్చిన బంగ్లాకు మరమ్మత్తులు జరుగుతున్నాయన్నారు. పిల్లల అవసరాలకు తగ్గట్టు దాన్ని డిజైన్ చేయించుకుంటున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆలస్యం అవుతుందన్నారు. ప్రస్తుతం ఖాళీ చేసే పనిలోనే ఉన్నామని, అక్కడ ఇంకా పనులు జరుగుతున్నందున ఖాళీ చేయడం వీలు కాలేదన్నారు.