
పార్లమెంటరీ కమిటీతో మాజీ సీజేఐలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జేఎస్ ఖెహార్, డీవై చంద్రచూడ్‌లు శుక్రవారం జమిలి ఎన్నికల బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీతో సమావేశమయ్యారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’విధానం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించడం లేదని వారు పేర్కొన్నారు. అదే సమయంలో, ప్రతిపాదిత చట్టంలో ఎన్నికల సంఘానికి మరిన్ని విస్తృత అధికారాలను కల్పించడాన్ని వారు ప్రశ్నించారు.
దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రయాణంలో పలు పరిణామాలను గుర్తు చేస్తూ పలు సూచనలను వారు అందజేశారు. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ బిల్లుపై పలువురు న్యాయ నిపుణులు, న్యాయ నిర్ణేతల అభిప్రాయాలను తీసుకుంటోంది. కాగా, ఈ కమిటీతో మాజీ సీజేఐలు యూయూ లలిత్, రంజన్ గొగోయ్‌లు ఇప్పటికే సమావేశమయ్యారు.