13 ఏళ్ల బాలుడిని పెళ్లాడిన ట్యూషన్‌ టీచర్.. చివరికి‌

Jalandhar: Tuition Teacher Marries 13 Year Old Student - Sakshi

జాతకంలో ఏదైనా దోషం ఉంటే నివారణకు పూజలు, హోమాలు జరిపించడం పరిపాటి. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఏర్పడిన దోషాన్ని తొలగించేందుకు నానా హంగామా చేస్తుంటారు. అయితే పంజాబ్‌లో జరిగిన ఓ పెళ్లి అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తోంది. జాతకంలో మాంగళ్య దోషం ఉందని 13 ఏళ్ల వయసున్న స్టూడెంట్‌ను వివాహం చేసుకుంది ఓ ట్యూషన్‌ టీచర్‌. ఈ విచిత్ర సంఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో‌ వెలుగు చూసింది. బస్తీ బావా ఖేల్‌ ప్రాంతంలోని ట్యూషన్‌ టీచర్‌గా పనిచేస్తున్న ఓ యువతికి కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఎంతకీ వివాహం కుదరకపోవడంతో ఆందోళన చెందిన యువతి తల్లిదండ్రులు పూజారిని సంప్రదించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో సంబంధిత యువతి పుట్టిన జాతకం ప్రకారం ఆమెకు మాంగళ్య దోషం ఉందని పూజారి పేర్కొన్నాడు. దీని నివారణకు ఆమెకు మైనర్‌ బాలుడితో ముందుగా పెళ్లి చేయాలని సూచించాడు.

ఈ క్రమంలో మహిళా తన వద్దకు ట్యూషన్‌ కోసం వచ్చే ఓ విద్యార్థుల్లోని 13 ఏళ్ల బాలుడిని పెళ్లి చేసేందుకు సిద్ధపడింది. ట్యూషన్‌ క్లాసుల కోసం బాలుడు తన వద్దే వారం పాటు ఉండాలని విద్యార్థి తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి ఒప్పించింది. 7 రోజులపాటు విద్యార్థిని టీచర్‌ తన ఇంట్లో పెట్టుకొని పెళ్లి వేడుకలు నిర్వహించారు. అనంతరం తన గాజులు పగలగొట్టి తనకు తాను వితంతువుగా మారిపోయి బాలుడిని ఇంటికి పంపించేసింది. వారం తర్వాత ఇంటికొచ్చిన బాలుడు తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు బస్తీ బావా ఖేల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కొడుకుని నిర్భందించి బలవంతంగా హల్దీ వేడుక, మొదటి రాత్రి వంటి ఆచారాలను నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై  కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. అయితే మహిళ ఒత్తిడి మేరకు బాధితుడి కుటుంబం ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. అయితే ఈ విషయం చివరికి సీనియర్‌ పోలీసు అధికారుల వరకు చేరడంతో దీనిని తీవ్రంగా పరిగణించిన డీఎస్పీ గుర్మీత్‌ సింగ్‌ పూర్తి దర్యాప్తుకు ఆదేశించారు. బాలుడు మైనర్‌ కావడంతో లోతుగా దర్యాప్తు చేయాలని, అతన్ని నిర్భంధంలో ఉంచడం చట్టవిరుద్దమని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ సదరు టీచర్‌పై, ఆమె తల్లిదండ్రులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top