
దాయాది పేరుందని స్వీట్ల పేరు మార్పు
పాక్ ఉన్నచోట శ్రీ అని చేరుస్తున్న దుకాణాలు
జైపూర్: ‘మైసూర్‌పాక్‌లో మైసూర్ ఏదిరా?’ అంటూ ఒక సినిమాలో హోటల్ యజమానిని కమెడియన్ పాత్రధారి నిలదీసే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. జైపూర్లో మాత్రం పలు మిఠాయి దుకాణాలు మాత్రం దాయాది పేరు ధ్వనిస్తోందనే కారణంతో మైసూర్‌పాక్ పేరును మైసూర్‌శ్రీగా మార్చేశాయి! అంతేగాక ప్రతి మిఠాయి పేరులోనూ పాక్‌కు బదులు శ్రీ అని చేరుస్తున్నాయి. అలా మోతీపాక్ మోతీశ్రీ, ఆమ్‌పాక్ ఆమ్‌శ్రీ గోండ్ పాక్ గోండ్‌శ్రీ అయిపోయాయి.
స్వర్ణభస్మపాక్, చాందీభస్మ్ పాక్ వంటి ప్రీమియం మిఠాయిలు కూడా స్వర్ణభస్మశ్రీ, చాందీభస్మ్ శ్రీగా పేరు మార్చుకున్నాయి. దేశాభిమానంతోనే ఈ పని చేసినట్టు జైపూర్లోని ప్రఖ్యాత ‘త్యోహార్ స్వీట్స్’, ‘బాంబే మృష్టాన్ భండార’ వంటి స్వీట్‌షాపుల యజమానులు చెబుతున్నారు. దీన్ని కస్టమర్లు కూడా ఎంతగానో మెచ్చుకుంటుండటం విశేషం! ‘‘స్వీట్ల పేర్ల మార్పు చిన్న విషయంగా అన్పించొచ్చు.
కానీ పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యం నుంచి చూస్తే ఇది చాలా శక్తిమంతమైన సాంస్కృతిక సంస్పందన. యుద్ధక్షేత్రం నుంచి మిఠాయి దుకాణాల దాకా మన వీర జవాన్లకు ప్రతి భారతవాసీ తోడుగా ఉన్నాడని చాటిచెప్పే ప్రయత్నమిది’’ అని వారంటున్నారు. ‘‘మైసూర్‌పాక్ పేరును మైసూర్‌శ్రీగా మార్చారని వినగానే నా పెదాలపై గర్వంతో కూడిన చిరునవ్వు ఉదయించింది. మన జవాన్ల వీరత్వానికి మిఠాయిలు కూడా ఇలా సెల్యూట్ చేస్తున్నాయని అనిపించింది’’ అని పుష్పా కౌశిక్ అనే రిటైర్డ్ టీచర్ చెప్పుకొచ్చారు.