GM Mustard: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే! | Jacob Nellithanam: Indian Farmers Have Varieties That Yield More Than GM Mustard | Sakshi
Sakshi News home page

GM Mustard: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!

Dec 13 2022 3:32 PM | Updated on Dec 13 2022 3:32 PM

Jacob Nellithanam: Indian Farmers Have Varieties That Yield More Than GM Mustard - Sakshi

జాకబ్‌ నెల్లితానం

మన దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ అనుమతి  ఉన్న ఏకైక పంట బీటీ పత్తి. ఇప్పుడు ఆహార పంటల్లోకి కూడా జన్యుమార్పిడి సాంకేతికత వచ్చేస్తోంది. జన్యుమార్పిడి ఆవాల సాగుకు కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రైజల్‌ కమిటీ (జెఈఏసీ) ఇటీవల అనుమతులు ఇవ్వటంతో చాలా ఏళ్ల తర్వాత జీఎం టెక్నాలజీ మళ్లీ చర్చనీయాంశమైంది. చీడపీడలను తట్టుకునే బీటీ జన్యువుతో పాటు కలుపుమందును తట్టుకునే విధంగా కూడా జన్యుమార్పిడి చేసిన (హెచ్‌టిబిటి) హైబ్రిడ్‌ ఆవాల రకం డిఎంహెచ్‌ 11కు జెఈఏసీ పచ్చజెండా ఊపటం, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రభుత్వ పరిశోధనా సంస్థల ఆవరణల్లో ప్రయోగాత్మకంగా సాగు ప్రారంభం కావటం జరిగిపోయింది. వంట నూనెల ఉత్పత్తిని దేశీయంగా పెంపొందించటం ద్వారా దిగుమతులను తగ్గించటం కోసమే బీటీ ఆవాలకు అనుమతి ఇచ్చినట్లు కేంద్రం చెబుతోంది. జీఎం పంటలకు వ్యతిరేకంగా చాలా ఏళ్ల నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో విచారణ కూడా ప్రారంభమైంది. 

ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ వ్యాప్తిని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వమే.. రసాయనిక కలుపుమందులను తట్టుకునే జన్యుమార్పిడి ఆహార పంటలకు గేట్లు తెరవటం విమర్శలకు తావిస్తోంది. సేంద్రియ వ్యవసాయంలో రసాయనాలతో పాటు జన్యుమార్పిడి పంటలూ నిషిద్ధమే. దేశవాళీ విత్తన పరిరక్షణ కృషిలో నిమగ్నమైన వందలాది సీడ్‌ సేవర్స్, సేంద్రియ రైతులతో కూడిన స్వచ్ఛంద సంస్థ ‘భారత్‌ బీజ్‌ స్వరాజ్‌ మంచ్‌’ హెచ్‌టిబిటి ఆవ పంటపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ పూర్వరంగంలో ‘మంచ్‌’ కన్వీనర్‌ జాకబ్‌ నెల్లితానంతో ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు ఇటీవల ముచ్చటించారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. 


పురుగును తట్టుకునే జన్యువులతోపాటు, కలుపు మందును తట్టుకునే ఆవాల పంటకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆవాల ఉత్పత్తి పెంచటం కోసమేనని ప్రభుత్వం చెబుతోంది. మీరేమనుకుంటున్నారు?

జన్యుమార్పిడి సాంకేతికతను ఆహార పంటల్లో ప్రవేశపెట్టాలన్న పట్టుదలతోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల జన్యుమార్పిడి ఆవ హైబ్రిడ్‌ పంట డిఎంహెచ్‌11 సాగుకు పర్యావరణ అనుమతి మంజూరు చేసింది. కేంద్రం చెబుతున్నట్లు దేశంలో ఆవాల దిగుబడి పెంచటం కోసమే అయితే కలుపుమందును తట్టుకునే హైబ్రిడ్‌ బీటీ ఆవ వంగడానికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధిక దిగుబడినిచ్చే వంగడాలు మన దగ్గర ఇప్పటికే ఉన్నాయి.

అధిక దిగుబడినిచ్చే ఆవ రకాలేవి?
జన్యుమార్పిడి ఆవ డిఎంహెచ్‌11 రకం హెక్టారుకు 30–32 క్వింటాళ్ల ఆవాల దిగుబడి ఇస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, అంతకన్నా ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలు మన రైతుల దగ్గర ఉన్నాయి. ఉదాహరణకు.. ‘గోబి సార్సమ్‌ మస్టర్డ్‌’ రకం. ఇది సేంద్రియ సేద్యంలో హెక్టారుకు 40 క్వింటాళ్ల ఆవాల దిగుబడిని ఇస్తుంది. 5 నెలల పంట. నారు పోసి, నాట్లు (3“2.5 అడుగుల దూరం) వేసుకోవడానికి అనువైన రకం ఇది. ప్రభుత్వం దిగుబడులు పెంచాలనుకుంటే ఇటువంటి వంగడాలను పోత్సహించుకోవచ్చు కదా? ప్రభుత్వం ఉద్దేశం ఒక్కటే.. ఆహార పంటల్లో కూడా జన్యుమార్పిడి సాంకేతికతను ప్రవేశపెట్టడం మాత్రమే.

జన్యుమార్పిడి ఆవ పంట కావాలని రైతులు అడగలేదు. ఆవాల జీవవైవిధ్యానికి మన దేశం పుట్టిల్లు. జీవవైవిధ్య కేంద్రాలైన దేశాల్లో ఆయా పంటల్లో జన్యుమార్పిడి ప్రవేశపెట్టవద్దని అంతర్జాతీయ జీవవైవిధ్య ఒడంబడిక నిర్దేశిస్తోంది. అయినా జీఎం ఆవాలను ప్రభుత్వం ముందుకు తెస్తోంది. జన్యుకాలుష్యం ముప్పు, తేనెటీగల పెంపకం, సేంద్రియ తేనె ఎగుమతి రంగానికి కలిగే తీరని/ వెనక్కి తీసుకోలేని నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పౌరసమాజం, రైతు సంఘాలు, సంస్థలు వద్దంటున్నా మొండిగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రజలు స్పందించి ఉద్యమించి అడ్డుకోకపోతే మరిన్ని ఆహార పంటలకు సంబంధించి జన్యుమార్పిడి విత్తనాలకు అనుమతులు మంజూరు చేసే ముప్పు పొంచి ఉంది. 

ఏయే ఆహార పంటల్లో జన్యుమార్పిడి విత్తనాలు రాబోతున్నారంటారు..?
కలుపుమందులను తట్టుకునే (హెచ్‌టీ) బీటీ పత్తి, బీటీ వంగ, బీటీ మొక్కజొన్న, బీటీ వరి తదితర జన్యుమార్పిడి పంటల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 

జన్యుమార్పిడి వల్ల ముప్పు ఏమిటి?
తరతరాలుగా మెరుగైన విత్తనాలను ఎంపిక చేసుకొని విత్తుకొని పంటలు పండిస్తూ, పండించిన పంట నుంచి విత్తనాలు దాచుకోవడానికి, ఇతరులతో పంచుకోవడానికి వ్యవసాయ సమాజాలకు, రైతులకు ఆయా సంప్రదాయ విత్తనాలపై సర్వహక్కులు ఉన్నాయి. ఈ హక్కుల్ని జన్యుమార్పిడి విత్తనాలు ధ్వంసం చేస్తాయి. వంగడాలు జీవ–సాంస్కృతిక వారసత్వంగా సంక్రమించినవి. వీటిని ప్రైవేటు/కార్పొరేట్‌ కంపెనీల లాభాపేక్ష కొద్దీ జన్యుమార్పిడి చేసి, కంపెనీల సొంత ఆస్థిగా విత్తనాలను మార్చే ప్రక్రియ ప్రజా వ్యతిరేకమైనది.

జన్యుమార్పిడి విత్తనాల వల్ల సంప్రదాయ పంటల స్వచ్ఛత దెబ్బతింటుంది. జన్యుకాలుష్యం జరగకుండానే చూడాలి. జరిగిన తర్వాత మళ్లీ పాత స్థితికి తేవటం సాధ్యం కాదు. భూమి, నీరు, జీవవైవిధ్యం, ప్రజారోగ్యం, పశుపక్ష్యాదుల ఆరోగ్యం కూడా జన్యుమార్పిడి పంటల దుష్పలితాలకు గురవుతాయి. అందుకే జన్యుమార్పిడి పంటలను మేం వ్యతిరేకిస్తున్నాం. మైసూరులో ఇటీవల జరిగిన కిసాన్‌ స్వరాజ్య సమ్మేళనం వెలువరించిన ‘విత్తన స్వరాజ్య ప్రకటన –2022’ రైతుల సంప్రదాయ విత్తన హక్కుల్ని కాపాడటంలో రాజీలేని ధోరణి చూపమని పాలకులకు విజ్ఞప్తి చేసింది. (క్లిక్‌ చేయండి: అల్సర్‌ని తగ్గించిన అరటి.. 10 పిలకల ధర 4,200)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement