‘అదో భయంకర ప్రయాణం.. లక్కీగా బతికాం’: ఎంపీ వేణుగోపాల్‌ | It was a terrible journey we were lucky to survive: MP Venugopal | Sakshi
Sakshi News home page

‘అదో భయంకర ప్రయాణం.. లక్కీగా బతికాం’: ఎంపీ వేణుగోపాల్‌

Aug 11 2025 8:39 AM | Updated on Aug 11 2025 9:07 AM

It was a terrible journey we were lucky to survive: MP Venugopal

న్యూఢిల్లీ: మరో ఎయిర్‌ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ సహా పలువురు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. త్రివేండ్రం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ ఎయిర్ ఇండియా విమానాన్ని సాంకేతిక సమస్యల కారణంగా చెన్నైకి అత్యవసరంగా మళ్లించారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ ఆ విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని ‘ఎక్స్‌’ పోస్టులో తెలియజేశారు. అదొక భయంకర ప్రయాణమని, విషాదానికి దగ్గరగా వచ్చామని దానిలో పేర్కొన్నారు.

వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, అప్పటికే బయలుదేరడానికి  ఆలస్యం అయిన ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపానికి గురయ్యింది. దీంతో దానిని చెన్నైకి మళ్లించారు. ‘త్రివేండ్రం నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI 2455లో నేను, పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. మేమంతా విషాదానికి దగ్గరగా వచ్చాం. ఆలస్యంగా బయలుదేరిన విమానం తరువాత భయంకరమైన ప్రయాణానికి దారి తీసింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే  మేమంతా కుదుపులకు గురయ్యాం. దాదాపు గంట తర్వాత కెప్టెన్ విమానంలో సిగ్నల్ లోపం ఉందని ప్రకటించి,  దానిని చెన్నైకి దారి మళ్లించారు. అయితే  విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అయ్యేందుకు అనుమతి కోసం రెండు గంటల పాటు ఎదురు చూశాం. మొదటి ప్రయత్నంలో అదే రన్‌వేపై ఒక విమానం ఉండటంతో మా విమానం ల్యాండ్‌ కావడం సాధ్యం కాలేదన్నారు. రెండవ ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. పైలట్‌ నైపుణ్యం, అదృష్టం కారణంగానే మేమంతా ప్రాణాలతో బయటపడ్డామని’ వేణుగోపాల్ పేర్కొన్నారు.
 

ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని, అలాంటి లోపాలు మళ్లీ తలెత్తకుండా  చూసుకోవాలని ఎయిర్‌ ఇండియాను ఆయన కోరారు. కాగా ఈ ఘటనపై స్పందించిన ఎయిర్‌ ఇండియా.. రన్‌వేపై మరో విమానం ఉండటం వల్ల  ఈ విమానం ల్యాండ్‌ కాలేదని, చెన్నై ఏటీసీ సూచనల మేరకు తరువాత ఆ విమానం ల్యాండ్‌ అయ్యిందని తెలిపింది.  విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్‌ ఇండియా పేర్కొంది. గత జూన్ 12న అహ్మదాబాద్‌లో చేసుకున్న ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, మరో 19 మంది ఇతరులు మృతి చెందారు. నాటి నుంచి ఎయిర్ ఇండియా విమానయాన సంస్జ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement