ఉగ్ర ‘టూల్‌కిట్‌’లో సోషల్‌ మీడియా

Internet and social media platforms now toolkits of terror groups - Sakshi

భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆందోళన 

ముష్కరుల చేతుల్లో నూతన టెక్నాలజీ దుర్వినియోగం 

ఢిల్లీలో కౌంటర్‌–టెర్రరిజం సదస్సు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యథేచ్ఛగా వాడుకుంటున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికలు ఉగ్రవాదుల టూల్‌కిట్‌లో ముఖ్యమైన సాధనాలుగా మారిపోయాయని చెప్పారు. ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్, క్రిప్టో–కరెన్సీ వంటి నూతన సాంకేతికతలను ముష్కరులు దుర్వినియోగం చేయకుండా అంతర్జాతీయంగా కఠిన చ్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రపంచదేశాలు గట్టి ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్సీ) ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన కౌంటర్‌–టెర్రరిజం కమిటీ(సీటీసీ) ప్రత్యేక సమావేశంలో జైశంకర్‌ మాట్లాడారు. భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల ప్రతినిధులు, పలువురు అంతర్జాతీయ నిపుణులు ఈ భేటీకి హాజరయ్యారు. ఉగ్రæ చర్యలపై యూఎన్‌ఎస్సీ భారత్‌లో సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి.  

ప్రపంచ మానవాళికి పెనుముప్పు  
ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత్‌ అంకితభావంతో కృషి చేస్తోందని జైశంకర్‌ పునరుద్ఘాటించారు. ‘ఐక్యరాజ్యసమితి ఫండ్‌ ఫర్‌ కౌంటర్‌–టెర్రరిజం’కు ఈ ఏడాది భారత్‌ స్వచ్ఛందంగా 5 లక్షల డాలర్లు ఇవ్వబోతోందని ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు చేరవేయడానికి, లక్ష్యాలపై దాడులు చేయడానికి ఉగ్రవాద సంస్థలు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు మానవ రహిత విమానాలు, డ్రోన్లు వాడుతుండడం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారిందన్నారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి పెద్ద ముప్పుగా పరిణమించిందని చెప్పారు.   

గ్లోబల్‌ యాక్షన్‌ కావాలి: గుటేరస్‌  
ఉగ్రవాద సంస్థలు ఆధునిక టెక్నాలజీని వాడుకోకుండా కట్టడి చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా కృషి (గ్లోబల్‌ యాక్షన్‌) చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటేరస్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక సందేశాన్ని పంపారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం కొత్త టెక్నాలజీని వాడుకోవడం వేగంగా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ చెప్పారు.  ‘ఢిల్లీ డిక్లరేషన్‌’ను 15 సభ్యదేశాల ప్రతినిధులు ఆమోదించారు.  ఉగ్ర సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రైవేట్‌ రంగం, పౌర సమాజంతో కలిసి పనిచేయాలని ప్రభుత్వాలకు కౌంటర్‌–టెర్రరిజం కమిటీ పిలుపునిచ్చింది.    

ఉగ్రవాదాన్ని ఉపేక్షించవద్దు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము  
భారత్‌ కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత దేశమేనని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఉగ్రవాద చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఉగ్రవాదులకు ప్రేరణ ఏదైనప్పటికీ వారి కార్యకలాపాలను అరికట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ముష్కర శక్తుల ఆట కట్టించే విషయంలో ప్రపంచ దేశాలకు భారత్‌ మార్గదర్శిగా కొనసాగాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆధ్వర్యంలో జరిగిన కౌంటర్‌–టెర్రరిజం కమిటీ(సీటీసీ) సమావేశాన్ని ఉద్దేశించిన ద్రౌపదీ ముర్ము  ప్రసంగించారు. ఉగ్రవాదంపై భారత్‌ అలుపెరుగని పోరాటం సాగిస్తోందని ఉద్ఘాటించారు. భారత్‌ ఉగ్రవాదం బారినపడిందని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top