ఇండియన్‌ ఆర్మీ ఎప్పుడు ఏర్పడింది? ‘ఆపరేషన్‌ రాహత్‌’ ఘనత ఏమిటి? | Sakshi
Sakshi News home page

Indian Army Day: ‘ఆపరేషన్‌ రాహత్‌’ ఘనత ఏమిటి?

Published Mon, Jan 15 2024 11:28 AM

Interesting Facts About Indian Army - Sakshi

దేశ రక్షణ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఇండియన్ ఆర్మీ. ప్రాణాలను సైతం లెక్క చేయక నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసే జవాన్ల త్యాగం ఎవరూ వెలకట్టలేనిది. భారత సైన్యానికున్న పరాక్రమాన్ని, ధీరత్వాన్ని, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన 20 ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

1. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ హయాంలో 1776లో కోల్‌కతాలో ఇండియన్ ఆర్మీ ఏర్పడింది.

2. సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి. ఇది సముద్ర మట్టానికి ఐదువేల మీటర్ల ఎత్తులో ఉంది. ఇది భారత సైన్యం ఆధీనంతో ఉంది.

3. హిమాలయాలలోని ద్రాస్, సురు నదుల మధ్య ఉన్న బెయిలీ వంతెన ప్రపంచంలోనే అతిపెద్ద వంతెన. దీనిని 1982లో భారత సైన్యం నిర్మించింది.

4. అమెరికా, చైనాల తర్వాత భారత సైన్యం ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైనికబలగం.

5. ఇతర ప్రభుత్వ సంస్థలలో మాదిరిగా భారత సాయుధ దళాలలో కులం లేదా మతం ఆధారిత రిజర్వేషన్ వ్యవస్థ లేదు.

6. 2013లో ఉత్తరాఖండ్‌లో వరద బాధితులను రక్షించేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ రాహత్’ ప్రపంచంలోనే అతిపెద్ద పౌర రెస్క్యూ ఆపరేషన్.

7. ప్రెసిడెంట్స్ బోర్డ్‌గార్డ్ అనేది భారత సైన్యంలోని పురాతన సైనిక దళం. ఇది 1773లో స్థాపితమయ్యింది. ప్రస్తుతం ఇది న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఉంది.

8. ఎత్తయిన పర్వతప్రాంతాలలో యుద్ధాలకు భారతీయ సైనికులు సమర్థులైనవారిగా గుర్తింపుపొందారు.

9. 1971 డిసెంబర్‌లో భారత్‌- పాకిస్తాన్ మధ్య జరిగిన లాంగేవాలా యుద్ధంలో కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే మరణించారు. ఈ యుద్ధ నేపధ్యంతోనే బాలీవుడ్ సినిమా ‘బోర్డర్’ రూపొందింది. 

10. ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే అతిపెద్ద వాలంటరీ ఆర్మీ. భారతఆర్మీ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైనికులను కలిగి ఉంది.

11. హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్ (హెచ్‌ఏడబ్ల్యుఎస్‌)ను భారత సైన్యం అత్యుత్తమ సైనిక శిక్షణ కోసం నిర్వహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేయడానికి ముందు అమెరికా, ఇంగ్లండ్, రష్యా ప్రత్యేక దళాలు ఇక్కడ శిక్షణ పొందాయి.

12. భారతదేశం 1970, 1990లో అణు పరీక్షలను నిర్వహించింది. 

13. కేరళలోని ఎజిమల నావల్ అకాడమీ మొత్తం ఆసియాలోనే అతిపెద్ద అకాడమీ.

14. భారత సైన్యంలో అశ్విక దళం కూడా ఉంది. ప్రపంచంలో ఇలాంటి రెజిమెంట్లు మూడు మాత్రమే ఉన్నాయి.

15. తజికిస్థాన్‌లో భారత వైమానిక దళానికి ఔట్-స్టేషన్ ఉంది. తజికిస్థాన్ తర్వాత, ఇప్పుడు భారత సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా తన అవుట్-స్టేషన్‌ను నిర్మించబోతోంది.

16. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్‌) భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ ఏజెన్సీలలో ఒకటి. ఇది భారతదేశంలోని అత్యంత విలాసవంతమైన రోడ్ల నిర్మాణం, నిర్వహణకు బాధ్యత వహిస్తుంది.

17. 1971లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఏకంగా 93 వేల మంది పాకిస్తానీ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం చోటుచేసుకున్న అతిపెద్ద లొంగుబాటు ఇదే.

18. పలువురు ప్రముఖులకు సాయుధ దళాల గౌరవ ర్యాంక్‌లు ఇచ్చారు. సచిన్ టెండూల్కర్‌కు భారత వైమానిక దళం కెప్టెన్ హోదాను ప్రదానం చేశారు. ఎంఎస్‌ ధోనీకి భారత సైన్యం లెఫ్టినెంట్ హోదాను ప్రదానం చేసింది.

19. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో గల మోవ్ భారతదేశంలోని పురాతన కంటోన్మెంట్‌లలో ఒకటి. 1840 నుండి 1948 వరకు రెజిమెంట్ ఇక్కడ శిక్షణ పొందింది. 

20. 1835లో స్థాపితమైన అస్సాం రైఫిల్స్..  భారత సైన్యంలోని పురాతన పారామిలిటరీ దళం.
 

 
Advertisement
 
Advertisement