
ఒరేయ్.. ఇది ఇన్‌స్టాగ్రామా?.. పొరపాటున గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశామా? అనేంత రేంజ్‌లో అసభ్యకరమైన కంటెంట్ కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్న రోజులివి. పైగా అలాంటి కంటెంట్‌కే ఫాలోవర్స్‌లో మాంచి డిమాండ్ ఉందని రెచ్చిపోతున్న తీరూ చూస్తున్నాం. బూతులతో కొందరు.. హాట్ హాట్ ఫోజులతో మరికొందరు.. సెమీ శృంగారంతో ఇంకొందరు.. చెలరేగిపోతున్నారు. అయితే ఇకపై అలాంటి వేషాలు చెల్లకపోవొచ్చు!.
ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ నెలకు రూ.30 వేల దాకా సంపాదిస్తున్న అక్కాచెల్లెలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్లు చేస్తోంది అసభ్యకరమైన కంటెంట్ కాబట్టి. వల్గర్ డైలాగులతో.. అతి జుగుప్సాకరమైన చేష్టలతో కంటెంట్ పోస్టు చేస్తూ వచ్చారు వాళ్లు. రానురాను వాళ్ల చేసే కంటెంట్ శ్రుతి మించిపోవడం.. అది తమ దృష్టికి వెళ్లడంతో సుమోటోగా కేసు నమోదు చేసి ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఈ చర్యలకు ఉపక్రమించారు. ఇక..
అసోంలో ఓ ఘనుడు.. తన మాజీ ప్రేయసిపై కోపంతో ఆమె ముఖంతో ఏఐ జనరేటెడ్ అశ్లీల ఇమేజ్‌లను సృష్టించాడు. అలా ఓ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ఓ ప్రముఖ అడల్ట్‌స్టార్ ఈ అకౌంట్‌కు స్పందించడంతో.. రాత్రికి రాత్రే ఈ అకౌంట్ తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు బాధితురాలు(సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరే!) సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో ఆ సైకోను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ అకౌంట్ ద్వారా సదరు నిందితుడు ఏకంగా రూ.10 లక్షల దాకా సంపాదించడాని తెలుస్తోంది.
రూల్స్‌కు పాతరేసి..
ఒకప్పుడు కంటెంట్ విషయంలో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్ కఠిన నిబంధనలే పాటించేది. అయితే రాను రాను ఆ పరిస్థితి దిగజారుతోంది. నిరసనలు, యుద్ధాలు, ప్రమాదాలు.. ఈ తరహా కంటెంట్ విషయంలో మాత్రమే Disclaimerను ఫాలో అవుతోంది. అమ్మాయిల హాట్ ఫోజులకు, సెమీ న్యూడ్ కంటెంట్‌కు, బూతు డైలాగులకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ సహా ఇతర యాప్‌లు అడ్డాగా మారిపోయాయి. ఇదే అదనుగా.. ఆదాయం కోసం అడ్డు అదుపు లేకుండా కంటెంట్ క్రియేటర్లు చెలరేగిపోతున్నారు. ఆఖరికి మీమర్లు కూడా తమ కంటెంట్ ప్రమోషన్ కోసం ఈ తరహా కంటెంట్‌ను తమకు తెలియకుండానే ప్రమోట్ చేస్తున్నారు. ఉదాహరణకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ అయ్యే కంటెంట్‌ను ఫిల్టర్ చేస్తే సగటున ఒక రోజులో 72 శాతం ఈ తరహా కంటెంట్ ఉండడం గమనార్హం!!.
ఏఐతో దారుణాలు
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాడకం.. నాణేనికి రెండోవైపుగానూ ఉంటోంది. అశ్లీల, అసభ్య కంటెంట్ విషయంలో ఇప్పుడు ఏఐదే ముఖ్యపాత్రగా మారింది. ఇందునా సెలబ్రిటీల కంటెంట్ అగ్రభాగంలో ఉంటోంది. డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలాంటి పాపులర్ యాప్‌లోనూ విచ్చలవిడిగా అప్‌లోడ్ చేస్తున్నారు. అలాంటి కంటెంట్‌కు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాకపోవడం గమనార్హం. అయితే..
ఈ మధ్య సెలబ్రిటీలు ఈ తరహా కంటెంట్ విషయంలో సీరియస్‌గానే స్పందిస్తున్నారు. దీంతో అరెస్టులు, కేసుల భయంతో ఎడిటర్లు మరో మలుపు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించుకున్న యువతను టార్గెట్ చేసుకుంటున్నారు.
అరెస్టులతోనే కట్టడి!
భారత్‌లో కఠిన చట్టాలు లేకపోవడమే.. బోల్డ్ కంటెంట్ వైరల్ కావడానికి ప్రధాన కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. చట్టసభలకే వదిలేసి.. ఈ తరహా వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి కోర్టులు సైతం ఆసక్తి చూపడం లేదు. కాబట్టి ప్రభుత్వాలే ఉక్కు పాదం మోపాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వాలు(తెలంగాణ సహా) ఈ తరహా కంటెంట్‌పై దృష్టిసారించాయి. తప్పుడు మార్గాల్లో సంపాదించాలని చూస్తే అరదండాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టు బాట పట్టాయి. ఈ ఏడాదిలో సోషల్ మీడియాలో వల్గర్ కంటెంట్ పోస్టు చేసినందుకు చాలా అరెస్టులే జరిగినట్లు ఆయా రాష్ట్రాల సైబర్ విభాగాలు చెబుతున్నాయి. దీంతో ఈ తరహా కఠిన చర్యలతోనే అలాంటి రీల్స్‌కు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు కూడా ఓ అంచనాకి వస్తున్నారు.