
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం సాయుధంగా బలపడుతోంది. దశాబ్దాల కాలం నాటి రైఫిళ్ల వాడకాన్ని దశలవారీగా నిలిపేయనుంది. తాజాగా శిక్షణ పూర్తిచేసుకోబోతున్న సైనికుల బ్యాచ్‌కు మరో రెండు, మూడు వారాల్లో 7,000 దాకా కలాష్నికోవ్ ఏకే–203 రకం రైఫిళ్లను అందజేయనున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని అమేథి నగరంలో ఇండో–రష్యన్ భాగస్వామ్యంతో ఈ రైఫిళ్లను తయారుచేస్తున్న విషయం విదితమే.
గత 18 నెలల్లో 48,000 రైఫిళ్లను తయారుచేసి సరఫరాచేశారు. 2023 జనవరిలో ఏకే203 రైఫిళ్ల ఉత్పత్తి అధికారికంగా ప్రారంభమైంది. 2026 కల్లా 1,00,000 యూనిట్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఇండో–రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గడువు ముగియనుంది. తర్వాత పూర్తిగా స్వదేశీ రైఫిల్‌గా ఇది అవతరించనుంది. ప్రస్తుతం రైఫిళ్లను 50 శాతం స్వదేశీ భాగాలతో ఉత్పత్తి చేస్తున్నారు.
అమేథీలో ప్రతి నెలా 12,000 రైఫిళ్లు తయారవుతున్నాయి. ప్రతి వంద సెకన్లకు ఒక రైఫిల్ తయారవుతోంది. ఒక సంవత్సరంలో 1.5 లక్షల రైఫిళ్లను ఉత్పత్తి చేస్తారు. పూర్తి ఆర్డర్ అంటే.. 6 లక్షల రైఫిళ్ల తయారీ 2030నాటికి పూర్తి కానుంది. గడువు కంటే దాదాపు 22 నెలలు ముందుగానే అన్ని రైళ్ల తయారీ, సరఫరా పూర్తి చేయనున్నట్టు అంచనా. ఇక ఈ రైఫిల్స్‌కు ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేయాలంటూ విజ్ఞప్తులు వచ్చాయి. భారత త్రివిధ బలగాల అవసరాలు తీరాక అనంతరం విదేశాలకు ఎగుమతి చేయనున్నారు.
ఏకే–203 ప్రత్యేకతలు
పాత కలాష్నికోవ్ సిరీస్‌కు ఆధునిక రూపం అయిన ఏకే–203 ఖచ్చితత్వంలో పనిచేస్తుంది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలతోపాటు అధిక ఎత్తుల్లో రణక్షేత్రాల్లో సులువుగా ఉపయోగించేందుకు అనువుగా దీనిని రూపొందించారు. నిమిషానికి 700 తూటాలను దీని నుంచి ప్రయోగించవచ్చు. గరిష్టంగా 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఇది ఖచ్చితత్వంతో చేధించగలదు.