breaking news
indo-russian series
-
సైన్యానికి 7 వేల ఏకే–203 రైఫిల్స్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం సాయుధంగా బలపడుతోంది. దశాబ్దాల కాలం నాటి రైఫిళ్ల వాడకాన్ని దశలవారీగా నిలిపేయనుంది. తాజాగా శిక్షణ పూర్తిచేసుకోబోతున్న సైనికుల బ్యాచ్‌కు మరో రెండు, మూడు వారాల్లో 7,000 దాకా కలాష్నికోవ్ ఏకే–203 రకం రైఫిళ్లను అందజేయనున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని అమేథి నగరంలో ఇండో–రష్యన్ భాగస్వామ్యంతో ఈ రైఫిళ్లను తయారుచేస్తున్న విషయం విదితమే. గత 18 నెలల్లో 48,000 రైఫిళ్లను తయారుచేసి సరఫరాచేశారు. 2023 జనవరిలో ఏకే203 రైఫిళ్ల ఉత్పత్తి అధికారికంగా ప్రారంభమైంది. 2026 కల్లా 1,00,000 యూనిట్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఇండో–రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గడువు ముగియనుంది. తర్వాత పూర్తిగా స్వదేశీ రైఫిల్‌గా ఇది అవతరించనుంది. ప్రస్తుతం రైఫిళ్లను 50 శాతం స్వదేశీ భాగాలతో ఉత్పత్తి చేస్తున్నారు. అమేథీలో ప్రతి నెలా 12,000 రైఫిళ్లు తయారవుతున్నాయి. ప్రతి వంద సెకన్లకు ఒక రైఫిల్ తయారవుతోంది. ఒక సంవత్సరంలో 1.5 లక్షల రైఫిళ్లను ఉత్పత్తి చేస్తారు. పూర్తి ఆర్డర్ అంటే.. 6 లక్షల రైఫిళ్ల తయారీ 2030నాటికి పూర్తి కానుంది. గడువు కంటే దాదాపు 22 నెలలు ముందుగానే అన్ని రైళ్ల తయారీ, సరఫరా పూర్తి చేయనున్నట్టు అంచనా. ఇక ఈ రైఫిల్స్‌కు ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేయాలంటూ విజ్ఞప్తులు వచ్చాయి. భారత త్రివిధ బలగాల అవసరాలు తీరాక అనంతరం విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఏకే–203 ప్రత్యేకతలుపాత కలాష్నికోవ్ సిరీస్‌కు ఆధునిక రూపం అయిన ఏకే–203 ఖచ్చితత్వంలో పనిచేస్తుంది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలతోపాటు అధిక ఎత్తుల్లో రణక్షేత్రాల్లో సులువుగా ఉపయోగించేందుకు అనువుగా దీనిని రూపొందించారు. నిమిషానికి 700 తూటాలను దీని నుంచి ప్రయోగించవచ్చు. గరిష్టంగా 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఇది ఖచ్చితత్వంతో చేధించగలదు. -
రష్యాలో మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 22వ ఇండో–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పలు రంగాల్లో విస్తృతస్థాయి సహకారంపై వారు చర్చిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగాక మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. మూడేళ్ల విరామం తర్వాత భారత్–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమిట్‌లో చర్చించబోయే అంశాలు, తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరిసారిగా 2021 డిసెంబర్లో ఢిల్లీలో ఈ సదస్సు జరిగింది. సోమవారం మధ్యాహ్నం రష్యాకు మోదీ చేరుకున్నాక పుతిన్ ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు. తర్వాత శిఖరాగ్ర సదస్సు జరగనుంది. మరుసటి రోజు రష్యాలోని భారతీయసంతతి వ్యక్తులతో మోదీ మాట్లాడతారు. తర్వాత క్లెమ్లిన్‌లో అనామక సైనికుల స్మారకం వద్ద అంజలి ఘటిస్తారు. తర్వాత మాస్కోలో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు.ఆస్ట్రియాలోనూ పర్యటనరష్యా పర్యటన తర్వాత 9వ తేదీన మోదీ ఆస్ట్రియాకు వెళ్తారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డీర్ బెల్లాన్, చాన్స్‌లర్ కార్ల్ నెహామెర్‌లతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ‘ఆస్ట్రియా, భారత్ మైత్రీబంధానికి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ మోదీతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నా’ అని నెహామెర్ శనివారం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌కు మోదీ ఆదివారం స్పందించారు. ‘‘ ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు, సహకారంలో కొత్త పథాలను అన్వేషించేందుకు మీతో చర్చల కోసం ఎదురుచూస్తున్నా’’ అని మోదీ ఆదివారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. భారత ప్రధాని ఒకరు ఆస్ట్రియాలో పర్యటిస్తుండటం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారికావడం విశేషం. భారత్, ఆస్ట్రియాకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో మోదీ భేటీ కొనసాగుతుంది. మాస్కోతోపాటు వియన్నాలోని భారతీయ సంతతి ప్రజలతో ప్రధాని ముచ్చటించనున్నారు. -
షోయబ్‌కు అరుదైన అవకాశం
ఇండో–రష్యన్ ప్రమోషనల్ సిరీస్‌కు వ్యాఖ్యాతగా ఆహ్వానం మాస్కో వెళ్లేందుకు ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు పెబ్బేరు: పెబ్బేరు పట్టణానికి చెందిన క్రికెట్ వ్యాఖ్యాత షోయబ్‌కు అరుదైన అవకాశం వచ్చింది. ఇదివరకు వివిధస్థాయిలో క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యహరించిన షోయబ్‌కు ఈ నెలలో రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న ఇండో–రష్యన్ ప్రమోషనల్ సిరీస్ క్రికెట్ టోర్నీలో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు అవకాశం వచ్చింది. ఇప్పటివరకు బీసీసీఐ అనుబంధ సిరీస్‌లో క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన షోయబ్‌కు ప్రస్తుతం ఐసీసీ అఫిషియల్స్‌తో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఎల్బీస్టేడియం కోచింగ్ సెంటర్ నుంచి షోయబ్‌ను అభినందిస్తూ లేఖ వచ్చింది. కొంత ఆర్థిక ఇబ్బందులు.. నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన షోయబ్ అనేక అవాంతరాలను ఎదుర్కొంటూ క్రికెట్ వ్యాఖ్యాతగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో వివిధ ప్రాంతాల్లో జరిగిన క్రికెట్ పోటీల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరి మన్ననలు పొందాడు. ప్రస్తుతం ఇండో–రష్యన్ ప్రమోషనల్ సిరీస్‌కు ఆహ్వానం రావడం గొప్పవిషయమే గానీ, మాస్కో వెళ్లేందుకు రవాణా ఖర్చులకు దాదాపు రూ.1.5లక్షలు అవుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్‌లో మరెన్నో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు వీలవుతుంది. కానీ షోయబ్‌కు ఆ స్థోమత లేకపోవడంతో నిరాశపడుతున్నాడు. ‘మాస్కో వెళ్లేందుకు ప్రభుత్వంతో పాటు ఎవరైన దాతలు ఆదుకోవాలి. క్రీడాకారులకు పెద్దమనస్సుతో సహాయం చేయాలి. ఈ అవకాశం చేజారితే భవిష్యత్‌లో మళ్లీ అవకాశం ఉంటుందో లేదో’ అని షోయబ్ చెబుతున్నాడు.