
సహచట్టం దరఖాస్తుకు అందజేసిన సమాచారంలో డీజీసీఏ వెల్లడి
హైదరాబాద్: అహ్మదాబాద్ ఘటన అనంతరం విమాన ప్రమాదాలకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఐదేళ్ల కాలంలో విమానాల ఇంజన్లు షట్‌డౌన్ అయిన ఘటనలు 65 నమోదవగా, ప్రమాదంలో ఉన్నామంటూ పైలట్లు కేవలం 17 నెలల వ్యవధిలోనే 11సార్లు కాల్ చేసినట్లు వెల్లడైంది. ఇందులో అహ్మదాబాద్ ఘటన, ఇండిగో విమానాన్ని దారి మళ్లించిన ఘటనలను మినహాయించారు.
సమాచార హక్కు చట్టం కింద టైమ్స్ ఆఫ్ ఇండియా పంపిన దరఖాస్తుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అందజేసిన సమాధానంలో ఈ వివరాలుండటం గమనార్హం. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం దుర్ఘటనకు ఇంజన్ ఫ్యూయల్ షట్‌డౌన్ కారణం కావచ్చునంటూ ప్రాథమిక నివేదిక అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో బయటకు వచ్చిన ఈ వివరాలు విమాన ప్రయాణికులకు భయం పుట్టించేలా ఉన్నాయి.
మెరుగ్గా లేని భారత్ రికార్డు
దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విమానయాన సంస్థల్లో ఇంజిన్ లోపాల ఘటనలు నెలకు కనీసం ఒకటి చొప్పున నమోదవుతున్నాయి. ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ ఘటన ఇందుకు తాజా ఉదాహరణగా డీజీసీఏ పేర్కొంది. గడిచిన ఐదేళ్లు 2020–2025 మధ్య కాలంలో సంభవించిన ఇంజన్ షట్‌డౌన్ ఘటనల్లో టేకాఫ్‌తోపాటు ఆకాశంలో ఉన్న సమయంలోనూ జరిగినవి ఉన్నాయంది. అయితే, చాలా సందర్భాల్లో పైలట్లు పనిచేసే ఒక్క ఇంజన్‌తోనే విమానాలను దగ్గర్లోని ఎయిర్‌పోర్టుల్లో సురక్షితంగా ల్యాండ్ చేశారని తెలిపింది.
టర్బయిన్ పనిచేయకపోవడం నుంచి ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాల్లో లోపాల వరకు అన్ని సాంకేతిక అంశాలను కలిపి నిపుణులు ఇంజన్ షట్‌డౌన్‌గా పేర్కొంటున్నారని డీజీసీఏ వివరించింది. 2024 జనవరి 1–2025 మే 31 మధ్య కాలంలో ప్రమాదంలో ఉన్నామంటూ పైలట్లు కాల్ చేసిన ఘటనలు 11 నమోదయ్యాయని, ఇందులో సాంకేతికలోపాలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సాయం కోరడం వంటివి ఉన్నాయని డీజీసీఏ పేర్కొంది.
ఈ 11 విమానాల్లో నాలుగు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యాయంది. ప్ర మాదంలో ఉన్నామంటూ పంపే సంకేతాలు (మేడే కాల్స్) సర్వసాధారణంగా జరుగుతుండేవేనని నిపుణులు అంటున్నారు. అయి తే, ఇందులో భారత్‌కు ఏమంత సంతృప్తికరమైన రికార్డులేదని పెదవి విరుస్తున్నారు. ఈ విషయంలో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన జాబితాలో భారత్ 48వ స్థానంలో నిలిచింది.