దేశంలో తొలి రైల్వే కేబుల్‌ బ్రిడ్జి సిద్ధం | Sakshi
Sakshi News home page

దేశంలో తొలి రైల్వే కేబుల్‌ బ్రిడ్జి సిద్ధం

Published Sun, Apr 30 2023 5:03 AM

India first cable stayed rail bridge is ready - Sakshi

జమ్మూ:  దేశంలోనే మొట్టమొదటి రైల్వే తీగల వంతెన నిర్మాణం పూర్తయ్యింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వయంగా వెల్లడిస్తూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. కేవలం 11 నెలల్లో ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యిందని తెలియజేశారు. వంతెన వీడియోను షేర్‌ చేశారు. జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లా అంజీ ఖద్‌లో ఈ కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించారు. దీని మొత్తం పొడవు 473.25 మీటర్లు. 96 ప్రధాన తీగలు ఉన్నాయి. ఉదంపూర్‌–శ్రీనగర్‌–బారాముల్లా రైల్‌ లింక్‌(యూఎస్‌బీఆర్‌ఎల్‌)లో ఈ బ్రిడ్జిని నిర్మించారు.

కాట్రా వైపు ఉన్న టన్నెల్‌ టీ2, రియాసీ వైపు ఉన్న టన్నెల్‌ టీ3ని ఇది అనుసంధానిస్తుంది. వంతెన నిర్మాణంలో ఉపయోగించిన మొత్తం తీగల పొడవు 653 కిలోమీటర్లు కావడం విశేషం. జమ్మూకశ్మీర్‌లో చీనాబ్‌ నదిపై ఉన్న రైల్వే వంతెన తర్వాత ఇది దేశంలోనే రెండో అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన. బలమైన గాలులు, తుఫాన్లు, పేలుళ్లను సైతం తట్టుకొనేలా డిజైన్‌ చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చేసిన ట్వీట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్సలెంట్‌(అద్భుతం) అంటూ స్పందించారు.   
 

 
Advertisement
 
Advertisement